March 13, 2013

ఆశీర్వదించిన చేతులకు ఆపదా..!

నలుగురూ బాగుండాలని ప్రార్థించే గొంతుకలవి. పది కాలాలపాటు సుఖశాంతుల్తో వర్ధిల్లాలని ఆశీర్వదించే చేతులవి. లోకకల్యాణం కోరుకునే మంచి మనస్సు వారిది. ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో అతిథులు వాళ్లు. అలాంటివారికి కష్టమొచ్చింది. వాళ్ల వృత్తికే కాదు.. ఉనికికే ఆపద ముంచుకొచ్చింది. ఆశీస్సులు అందించిన చేతులతోనే ఇప్పుడు ఆదుకోవాలని కోరుతున్న బ్రాహ్మణ ప్రతినిధులను చూస్తే బాధనిపించింది. పాలకొల్లు సెంటర్‌లో వారంతా నన్ను కలిశారు. ఎలా బతికిన వారు ఎలాగయిపోయారు! అగ్రవర్ణాల్లో పేదల దుస్థితికి నిదర్శనంగా కనిపించారు. దీపానికీ నోచుకోని దేవాలయాలు ఎన్నో.. గుడి కింద భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరి గుడిని, ఆ అరకొర గుడి మాన్యాన్ని నమ్ముకొని బతుకుతున్న వారి గతి ఏమి కావాలి?

అభిమానానికి హద్దులు లేవంటారు. విదేశాల నుంచి తరలివచ్చిన ఈ యువకులను చూస్తే..అది నిజమేననిపించింది. సంపన్న జీవితాలు గడుపుతూ ఎక్కడో విలాసంగా జీవించే ఈ కుర్రాళ్లు..నా కోసం ఇంత దూరం వచ్చారు. కష్టంలో ఉన్న ప్రజల కోసం నేను నడు స్తుండగా, నా కోసం వీళ్లు ముందుకు రావడం ముచ్చటేసింది. నడిచినంత సేపూ రాష్ట్ర పరిస్థితులపై పదేపదే ఆవేదన వెలిబుచ్చారు. "అప్పట్లో మీరు తీసుకున్న విధానాలే మాకిప్పుడు బంగారు బాటలుగా మారాయి సార్.. ఆ రోజు మీరు మా గురించి పట్టించుకోకపోతే ఎదుగూబొదుగూ లేకుండా పడి ఉండేవాళ్లం. ఈ అవకాశం మాతోనే ఆగిపోరాదు. మరికొందరు సోదరులూ పైకి రావాలి. మంచి ఉద్యోగాలు పొంది ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి గౌరవం పెంచాలి. దానికోసం మీరు మళ్లీ అధికారంలోకి రావాలి'' అని వాళ్లు చెబుతుంటే.. ఈ రాష్ట్ర యువత కలలు నా కళ్ల ముందు కదలాడాయి.