March 13, 2013

పల్లెపల్లెకు టీడీపీలో వెల్లువెత్తిన వినతులు

వి.కోట: పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎంఎం కుంట గ్రామానికెళ్లిన టీడీపీ నాయకులకు గ్రామస్థులు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. తాగడానికి నీరు, రాత్రివేళ వీధిదీపాలు లేకుండా చీకట్లో గడుపుతుంటే తమ సమస్యలెవరికీ పట్టడం లేదని వారు వాపోయారు. దీంతో తాము అధికారంలో లేమని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాసమస్యలు పట్టించుకోవడంలేదని అందుకే సమస్యల అ«ధ్యయనం కోసం తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి పట్నంసుబ్బయ్య వివరించారు. మంగళవారం మండల పరిధిలోని యాలకల్లు, ముదరందొడ్డి, ఓగు పంచాయతీల పరిధిలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రిగానేపల్లె, తిమ్మరాజుపురం గ్రామాల్లో కాంగ్రెస్, వైసీపీ నుంచి సుమారు 20 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు వారికి పూలమాలతో సత్కరించి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

చంద్రబాబు నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రానున్న ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా గెలుపే ధ్యేయంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామచంద్రనాయుడు, రంగనాథ్, సోము, సుభాష్‌చంద్ర బోస్, రత్నప్ప, చౌడప్ప, సింగిల్ విండో అధ్యక్షుడు నాగప్ప, చక్రపాణినాయుడు, ఉపాధ్యక్షులు సురేష్, స్థానిక నాయకులు శంకర, రవి, నాగరాజు, రాజారెడ్డి, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.