March 13, 2013

అధికారం కోసం తల్లి,పిల్ల కాంగ్రెస్‌ల ఆగ్రహం

కడప, కోటిరెడ్డిసర్కిల్: పదవుల కోసం పిల్ల కాంగ్రెస్ ఆశపడుతుండ గా అధికారం కోసం తల్లి కాంగ్రెస్ ఆరాట పడుతోందంటూ తెలుగుదే శం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.వెంకటశివారెడ్డి నివాసంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, వెంకటశివారెడ్డి, సుబాన్‌బాష, సుగవాశి హరీంద్రనాధ్ మాట్లాడుతూ మాట తప్పం మడమతిప్పం, ఢిల్లీకి కడప గడపకు పోటీ, యూపీఏ సర్కారు తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు ఇప్పడు యూపీఏతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారన్నారు.

జైల్లో ఉండి పిల్ల కాంగ్రెస్, బయట ఉండి తల్లి కాంగ్రెస్ విలీనం కోసం రాజకీయ నాటకం ఆడుతున్నాయన్నారు. వైకాపా నేతల జుట్టు సోనియా చేతిలో ఆమె గుట్టు వీరి గుప్పెట్లో ఉంచుకుని ఒకరి నొకరు బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి, ఆర్థిక నేరాలకు పాల్పడి న వైకాపా వారి మీద కేంద్రం చర్యలు తీసుకోకపోవడం మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో విలీనానికి, పొత్తులకు సిద్దమంటూ జైలుకె ళ్ళక ముందు జగన్, ఇప్పుడు వైఎస్ విజయమ్మలు ఇంగ్లీషు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చి సోనియాకు సంకేతాలు పంపించారన్నారు. ఇందులో భాగంగా సీబీఐకి జగన్ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. వివరాల కోసం నెలలో 15 సార్లు విజ్ఞప్తి చేశామని సీబీఐ న్యాయవాది హై కోర్టుకు కూడా తెలిపారన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను కాపాడేందుకు సీఎం ఉత్సాహం చూపుతున్నారన్నారు.