March 13, 2013

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది : చంద్రబాబు

గవర్నర్ ప్రసంగం తప్పుల తడక
ఈ ప్రభుత్వంలో ఇదే గవర్నర్ చివరి ప్రసంగం

ప.గో : అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి దశాదిశా లేదని, ప్రసంగమంతా తప్పుల తడక అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్‌కు ఇదే చివరి ప్రసంగం అని ఆయన అన్నారు. మూడున్నరేల్లలో గవర్నర్ ప్రసంగంలో చెప్పినవేవి అమలుకాలేదని బాబు ఆగ్రహం వ్యక్తపరిచారు.

పంటలకు మద్దతు ధరలేదు...సీఎం కిరణ్‌కుమార్‌కు అనుభవం లేదని బాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో 11 స్థానానికి పడిపోయామని, అన్ని రంగాల్లో వెనుకబడి పోయామన్నారు. ప్రపంచం ఆశ్చర్య పోయేలా కాంగ్రెస్ వాళ్లు అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని ఈ స్థాయికి పతనం చేయడం కాంగ్రెస్‌కే సాధ్యమని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలినా...దాని మూలం హైదరాబాద్‌లోనే ఉంటుదన్నారు. టీడీపీ హయాంలో రూ.50 వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు లక్షా 73 వేల కోట్లకు చేర్చారన్నారు. ఉపాధి హామీ పథకం ఓ అవినీతి పథకమని దుయ్యబట్టారు. కరెంట్ కోతలతో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు. పావలావడ్డీ ఓ ఫాల్స్ అని మహిళలు తిడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

అవిశ్వాసంపై బాబు మాట్లాడుతూ అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని, తమ వ్యూహం తమకుందన్నారు. సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొన్నవారికి తాము మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. మనుషులను కొని రాజకీయాలు చేయడం నీతి మాలిన చర్యగా బాబు అభివర్ణించారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడాల్సిన ఖర్మ లేదని, తనపై ఏమాన్న కేసులున్నాయా, తన ఇంటి అనుమతులు కావాలా వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు.అవిశ్వాసం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజా అవసారల కోసం కాదని చంద్రబాబునాయుడు అన్నారు.