March 13, 2013

పిచ్చి పిచ్చి పనులు చేస్తే క్షమించేది లేదు


పాలకొల్లు  : స్థానిక ఎన్టీఆర్ ఘాట్‌వద్ద బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తన ప్రసంగం అనంతరం సభికులకు మైకు ఇచ్చి సమస్యలు అడిగారు. దీనిపై సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక యువకుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలో కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించాడు. దీనిపై బాబు తీవ్రంగా స్పందిస్తూ ఈ విషయం నిజమేనా... అని సభికులుని ప్రశ్నిస్తూ చేతులు ఎత్తమని సూచించారు. పెద్ద ఎత్తున చేతులు ఎత్తడంతో బాబు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే క్షమించేది లేదని, తప్పు డు పనులకు సహకరిస్తే అధికారులకు సైతం పనిష్‌మెంట్ ఉంటుందని హెచ్చరించారు.

ఒక ఆటోవాలా మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి 10వ తరగతి విద్యార్హత అడగడంతో ఆటో డ్రైవర్లకు లైసెన్స్‌లు రావడంలేదని చెప్పడంతో బాబు స్పంది స్తూ విద్య అంతగా అబ్బని యువకులే ఆటో డ్రైవింగ్ వంటి వృత్తుల్లోకి వస్తారని లైసెన్స్‌లు మంజూరు సులభతరం చేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

భవానీ అనే మహిళ మాట్లాడుతూ ఎకరం పొలం ఉంటే రూ. 10 వేలు ఆదాయం రావడంలేదని తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంక్ అధికారులు తమ ఫోటోలను పత్రికలకు ఇస్తామని హె చ్చరిస్తున్నారని, అయితే లక్షల కోట్లు అవినీతి పరులను, బ్యాంక్‌లలో రుణా లు తీసుకొని కోట్లు ఎగవేస్తున్న వారిని పట్టించుకోవడంలేదని ఆమె వాపోయారు. దీనిపై బాబు స్పందిస్తు తా ము అధికారంలోకి వస్తే రైతుల కష్టా లు తీరుస్తామన్నారు.

స్వర్ణకార వృత్తికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందడంలేదన్నారు. బాబు బదులిస్తూ మంగళ సూత్రాలు తయారుచేసే పవిత్ర కార్యక్రమాన్ని స్వర్ణకారులు నిర్వహిస్తారని, అటువంటి వారిపై నేటి కాంగ్రెస్ పాలనలో దొంగ బంగారం కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని స్వర్ణకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు ఇంకా పలు సామాజిక వర్గాలకు ఆరాధ్య దైవమైన వీరబ్రహ్మేంద్రస్వామిని కించపరుస్తూ ఒక వ్యక్తి పిహెచ్‌డి చేస్తే దానికి ఆమోద ముద్ర వేశారని ఈ అంశాన్ని తాము ఖండిస్తున్నామని బాబు అన్నారు. ఆయా సామాజిక వర్గాల మనోభావాలను కించపరచవద్దని హెచ్చరించారు.