March 13, 2013

ఎమ్మెల్యేల కంటే పోలీసులే ఎక్కువ: టీడీపీ

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగించిన చాంబర్‌లో 144 సెక్షన్ విధించినట్లుగా ఉందని, ఎమ్మెల్యేల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారని టీడీపీ శాసనమండలిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. గవర్నర్ ప్రసంగం చిన్న పిల్లల మాటల్లా ఉందని, ఇది అబద్ధాల ప్రసంగం కాబట్టే తాము బహిష్కరించామని, వాకౌట్ చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుపడ్డారని చెప్పారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2007లో వైఎస్ హయాంలో చెప్పిన విషయాలే ఇప్పుడూ ఉన్నాయని ఎద్దేవా చేశారు. విద్యుత్తు సంక్షోభంతో ప్రజలు అల్లాడుతుంటే గవర్నర్ తన ప్రసంగంలో కనీసం ఆ అంశాన్ని స్పృశించకపోవడం దుర్మార్గమని యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు.

మొండివాడినని చెప్పుకొంటున్న సీఎం.. ప్రజాసమస్యల పరిష్కారంలో ఆ మొండితనాన్ని చూపించాలి తప్ప అణచివేయడంలో కాదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్, వైసీపీలను తల్లి, పిల్ల కాంగ్రెస్ అంటున్న చంద్రబాబుది ఏ కాంగ్రెస్ అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం నిస్సారంగా, హాస్యాస్పదంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. వరుస కుంభకోణాలు, కరెంటు కోతలు, ఎఫ్ఎస్ఏ, మూత్రపిండాల అమ్మకాలు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు.

గవర్నర్ ప్రసంగం ఏమాత్రం గమ్యం లేనిదని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదివారని, ప్రజాసమస్యల పరిష్కారానికి ఎటువంటి దిక్సూచి లేదని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం దారుణం, విచారకరమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.

2009 నాటి ప్రసంగానికి నకలుగా ప్రసంగం ఉందని వైసీపీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్‌పైకి కాగితాలను విసిరేయడం దుస్సంప్రదాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాగా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కరెంటు కోతతో అల్లాడుతుంటే జగన్ ఉన్న చంచల్‌గూడ జైలులో మాత్రం ఒక్క నిమషం కూడా కోత లేదని, సీఎం కిరణ్‌కు ప్రభు భక్తికి ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విలేకరులతో అన్నారు.