March 13, 2013

దోపిడీదారులను తరిమేయండి


(ఏలూరు) 'ఈ ర్రాష్టం బాగుపడాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో గడపాలన్నా, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్థిల్లాలన్నా ముందుగా పార్టీలుగా చెప్పుకొచ్చే దోపిడీదారులను తరిమివేయండి. అధికారంలోకి రాగానే మీకు పెద్దన్నగా తోడుగా నిలుస్తా' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం యాత్ర జిల్లాలో నాల్గవ రోజైన మంగళవారం ఉత్సాహంగా సాగింది. వందలాది అభిమానుల నడుమ బాబు పాదయాత్ర సాగించారు. పెన్నాడ, శృంగవృక్షం, వీరవాసరం, ఎస్.చిక్కాలతో పలు కూడళ్లలో భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఇక అవినీతిని చూస్తూ ఊరుకుంటే ఈ ర్రాష్టం అధోగతి పాలవుతుందని, నేనొక్కడినే కాదు, మీరు కూడా ఈ ధర్మపోరాటంలోకి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో అన్ని వర్గాలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

'ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సుఖశాంతులు లేవు, ఉన్నదల్లా అవినీతే' అంటూ ఎద్దేవా చేశారు. మీలో ఎవరైనా సుఖశాంతులతో గడుపుతున్నారా అంటూ అన్నిచోట్ల ప్రశ్నలు సంధిస్తూ లేదు.. లేదు అని సమాధానాలను ప్రజల నుంచి రాబట్టారు. కరెంటు కోతలతో పాటు గుండెలు అదిరే బిల్లులువస్తున్నాయని, ఇది చేతకాని ప్రభుత్వ పాలనకు మచ్చుతునక అన్నారు. వైఎస్ ర్రాష్ట సంపదను కొడుకికి దోచిపెట్టారని, కిరణ్‌కుమార్‌రెడ్డి పన్నుల రూపంలో జనం మీద పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలోను, ఇప్పుడు కూడా కాంగ్రెస్ దొంగలు ఊళ్లకు ఊళ్లే దోచేస్తున్నారని ఆరోపించారు. ముందు చూపు లేని పాలన కారణంగా ఏఒక్క వర్గం కూడా ఇప్పుడు సుఖంగా లేకుండా పోయిందన్నారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు అంటే మీకు ఆదర్శంగా ఉండాలే తప్ప మీరు అసహ్యించుకునే మాదిరిగా ఉండకూదని, అందుకోసమే తాను నిప్పులా పాలించానని, ప్రజలకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు.

ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డి వల్ల ర్రాష్టం అధోగతి పాలైందన్నారు. చీకటి రాజకీయాలు సాగుతున్నాయి, దొంగలు మళ్లీ ర్రాష్టం మీద పడాలనిచూస్తున్నారు, జాగ్రత్త అంటూ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. ర్రాష్ట ఆర్ధిక వ్యవస్థ దారుణంగా మారిపోయింది. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర లేకుండా పోయింది. దద్దమ్మలకు ఓటేసినందుకుగాను ఇప్పుడు ఇన్నికష్టాలు వచ్చాయని, ఇప్పటికైనా ప్రజలకోసం పనిచేసే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలపై కూడా ఆయన చాలాచోట్ల విరుచుకుపడ్డారు. 'నేను ఒక్కడినే అవినీతిపై పోరాటం చేయాలా, మీరంతా ఆ బాధ్యత నాకే వదిలేసి ఊరుకోదలిచారా?' అంటూ కొన్నిచోట్ల సభికులను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి జగన్ అని అపహాస్యం చేశారు.

వాళ్ల అమ్మ మాత్రం తన కొడుకుని సీ ఎం చేయాలని తెగ ఆరాటపడిపోతోందని, ఇప్పటివరకు దోచుకుంది చాలక, మళ్లీ మళ్లీ దోచుకుందామని పిల్ల కాంగ్రెస్ ఆరాటపడిపోతోందని అపహాస్యం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేసే విషయంలో తన వద్ద ఒక ప్రణాళిక ఉందని, అది అధికారంలోకి రాగానే అమలులోకి తెస్తానని అన్నారు. వీరవాసరంలో మురికినీళ్లనే మంచినీళ్లుగా ఇస్తున్నారు.. అయితే మందు కావాలంటే మాత్రం క్షణాల్లో మీ ముందు వుంచుతున్నారు. ప్రజలకు నీళ్లు కావాలా.. మందుకావాలా కూడా తెలియనంతగా ఈ గుడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కిరికిరి సీఎంగా ఆయన పదే పదే అభివర్ణించారు.

ఇక ముందు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. మీరంతా సిద్ధంగా ఉండాలని కూడా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తూనే ఒకప్పుడు ఏ చిన్న విషయంపైనైనా కార్యకర్తలు, నాయకులు ప్రతిస్పందించేవారు. ఇప్పుడా పరిస్థితి నుంచి చూద్దాంలే అనే స్థాయికి ఎవరూ వెళ్లవద్దు. తప్పుని తప్పుగానే ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 2014 ఎన్నికల నాటికి జగన్‌పై ఉన్న కేసులను మాఫీ చేసేందుకు ఆ పార్టీ కుతంత్రాలకు దిగుతోందని, రాజీపడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆమె(విజయలక్ష్మి) ప్రతిసారీ ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని ఆరోపిస్తోంది.. అంటే మీరు డబ్బుదోచుకున్నారు, జనం సొమ్ము దోచుకున్నారు.. అని మేము బహిర్గతం చేసినందుకేనా ప్రతిపక్షం విఫలమైందంటూ ఆయన ప్రశ్నల వర్షంకురిపంచారు. వైఎస్ బతికున్నప్పుడే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తించాం.

ఇప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మాకేమీ కొత్త కాదని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు.పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇక కార్యకర్తలకు పని కల్పించేందుకు కూడా పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని మరికొన్నిచోట్ల చెప్పారు.వీరవాసరం బహిరంగ సభలో అవినీతికి దాసోహం అయ్యేలా కొందరు వ్యవహరిస్తున్నారు, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులతో సహా అగ్రవర్ణాల్లో కూడా పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాపులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని, ఇప్పటికే బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా మాకే ఉంది, మీరెవరూ అధైర్యపడాల్సిన పనిలేదు. అధికారంలోకి రాగానే దీనిని పూర్తి చేస్తామని, రైతులకు పూర్తిగా సాగునీరు అందిస్తామన్నారు. బాబు వెంట జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మాగం టి బాబు, పాలి ప్రసాద్, వై.టి.రాజా తదితరులు ఉన్నారు.