March 13, 2013

జగన్‌ను విడిపించేందుకే విలీనం

నందిగామ: జగన్‌ను జైలు నుంచి విడుదల చేయించుకునేందుకు పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు విజయలక్ష్మి సిద్ధమయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.అవినీతి సొమ్ముతో అధికారం చెలాయించాలనుకున్న పార్టీలకు ప్రజలు బుద్ధ్ది చెప్పడం ప్రారంభించారని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వారిద్దరికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

కర్నాటకలో బీఎస్ఆర్ పార్టీకి పట్టిన గతే మన రాష్ట్రంలో వైసీపీకి పడుతుందన్నారు. విద్యుత్, తాగునీరు, గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులను హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాలను అరకొరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సాగర్ నీటిని విడుదల చేసి గ్రామాలలో చెరువులు నింపి మంచినీటి కొరత ఏర్పడకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.