April 5, 2013

కాంగ్రెస్ పాలనలో వింతలెన్నో..?

పిఠాపురం దాటిన తర్వాత కళ తప్పిన భవనం ఒకటి కనిపించింది. చేనేత సహకార భవనం అని తెలిసి లోపలికి వెళ్లాను. అక్కడంతా శ్మశాన వాతావరణం కనిపించింది. మగ్గాలన్నీ శిథిలావస్థకు చేరాయి. కార్మికుల శరీరాలు ఎముకల గూళ్లలా ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం వారంతా ఆ మగ్గాలనే నమ్ముకున్నారు. వారి బాధలు ఎన్నని చెప్పను? వాళ్లేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆప్కోను ఆదుకోవాలని, అన్నగారి జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నారు.

సమయానికి విద్యుత్ ఇవ్వాలని, మగ్గాలు మళ్లీ కళకళలాడాలని, చేనేత సొసైటీలకు పూర్వ వైభవం రావాలని ఆశిస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్నామని, ప్రభుత్వం ఎంతోకొంత విదిలించినా.. ఆ నిధులు చేతిదాకా రావేమని ఆ చేనేత కార్మికులంతా నాతో మొరపెట్టుకున్నారు. ఏడాది ముగిసే సరికి ఆశలు ఆవిరైపోవడం అలవాటైపోయిందని తమ ఆవేదన వెళ్లగక్కారు. త్వరలోనే వారి కష్టాలను తీరుస్తానని భరోసా ఇచ్చి.. మరొక్క ఏడాది ఓపిక పట్టాల్సిందిగా ఓదార్చి ముందుకు కదిలాను.

చేబ్రోలులో క్రైస్తవ సోదరులు వాళ్ల సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమంలో తమకు న్యాయమైన వాటా రావాలని, చర్చిల ఆస్తులు కర్పూరంలా కరిగిపోకుండా చూడాలని నాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక చేబ్రోలు పట్టణంలో పేదల చేతిలో పట్టాలున్నాయి గానీ, కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలను మాత్రం చూపించలేదు. అసలు తమకు భూమి ఇచ్చారో లేదో కూడా వారికి తెలియదు. వారికే కాదు.. ఆ విషయం నేతలకే తెలియదు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి వింతలు ఎన్నో!