April 5, 2013

భారం ఎవరు భరిస్తారు!?: ముద్దు

హైదరాబాద్ : "200 యూనిట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం తగ్గించామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ, ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పడం లేదు. ప్రభుత్వం భరించకుండా డిస్కంలకు వదిలి వేస్తే అవి మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట జనాన్ని బాదుతాయి. తగ్గింపు భారం ఎవరు భరిస్తారో.. ఎలా భరిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి'' అని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.

50 యూనిట్లలోపు గతంలో కూడా పెంచలేదని, ఆపైన 200 యూనిట్లలోపు వారికి ఇచ్చిన ఉపశమనం కూడా స్వల్పమని, ఆ కేటగిరీల్లో లబ్దిదారులు తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. "గ్రామ పంచాయితీల మంచినీటి పథకాలకు, రైతుల ఎత్తిపోతల పథకాలకు, మునిసిపాలిటీల్లో వీధి లైట్లకు, చిన్న తరహా పరిశ్రమలకు పెంచారు. వాటికి చార్జీల తగ్గింపు గురించి మాట్లాడటం లేదు. వీటిపై ప్రభుత్వం స్పందించే వరకూ మా పోరాటం ఆగదు'' అని ఆయన స్పష్టం చేశారు.