April 5, 2013

కాపుల సంక్షేమానికి టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం

అమలాపురం: గతంలో మరే రాజకీయ పార్టీ ప్రకటించని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రూ.ఐదు వేలకోట్ల ప్యాకేజీని రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి, టీడీపీకి చెందిన నాయకుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అన్నారు. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వమే కాపుల్లో వెనుకపడిన వారి కోసం నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల వంతున ఐదేళ్ల కాలపరిమితిలో రూ.అయిదు వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి ఆర్థికంగా వెనుక బడిన కాపు సామాజిక వర్గానికి అండగా నిలవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి కాపు కులస్థుడు అండగా నిలవాలని మెట్ల పిలుపునిచ్చారు.

జిల్లాలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి చంద్రబాబు కాపులకు జిల్లాలో ప్యాకేజీని ప్రకటించడం పట్ల ఆయన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఆయన స్వగృహంలో ఈ సందర్భంగా కార్యకర్తల నడుమ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాపులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర అగ్రవర్ణాల్లోని నిరుపేదల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల ఒకటవ తేదీన జిల్లాలో చంద్రబాబును కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందసామన్నారు. ఆ వినతిపత్రంలోని డిమాండ్లను పరిశీలించిన చంద్రబాబు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించడం ద్వారా జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకర్షించగలిగారన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతికి చెందిన కాపు విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్య, ఇతర అగ్రవర్ణ పేదలకు హాస్టల్ సౌకర్యం, జిల్లాకు ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ఉపాధి లేని కాపు యువతకు బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని, ఫీజు రీఎంబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలని కాపులకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీల రిజర్వేషన్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కాపులకు ఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్లు వర్తింప చేయాలని కోరుతూ చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు.

కాపు, అగ్రవర్ణ పేదలను ఆదుకునే లక్ష్యంతో చంద్రబాబునాయుడు రూ.ఐదువేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు పార్టీ తరపున, సామాజిక వర్గీయుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మెట్ల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరు
పేదలకు కనీసం ఇళ్ల స్థల పట్టాలు కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పేరూరు, బండారులంకల్లో భూములు కొనుగోలు చేసినప్పటికీ నాటి నుంచి నేటివరకు పేదలకు పట్టాలు ఇవ్వలేకపోయారన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర పాలన తిరిగి గాడిలో పడుతుందని ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశానికి అండగా ఉండాలని అవినీతి రహిత పాలనకు సహకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు యాళ్ల మల్లేశ్వరరావు, సలాది బాబూరావు, మెట్ల రమణబాబు, చిక్కాల గణేష్, పిండి సాయిబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, భాస్కర్ల రామకృష్ణ, జంగా అబ్బాయి వెంకన్న, బొర్రా ఈశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.