April 5, 2013

టీడీపీకి.. తూర్పు కంచుకోట

కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ముందు నుంచీ టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిజాయితీగా ఉన్నారని స్పష్టం చేశారు.

తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా, నిజాయితీపరులు సమాజంలో శాశ్వతంగా ఉండిపోతారన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా గురువారం పిఠాపురం మండలం గొల్లప్రోలు సమీపంలో తాటిపర్తి సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో చంద్రబాబు కార్యకర్తలతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా అనపర్తికి చెందిన ఒక కార్యకర్త మూలారెడ్డి ఆర్థికంగా చితికిపోయారని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక్క మూలారెడ్డే కాదు.. టీడీపీ నాయకులంతా నిజాయితీగా పనిచేశారని, చిక్కాల రామచంద్రరావు వంటి అనేకమంది ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తుచేశారు.

కాకినాడ ఎమ్మెల్యే వందల, వేల కోట్ల రూపాయలకు బినామీగా ఉన్నారన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచి కాకినాడనూ దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా పెదపూడి మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు బొడ్డు భాస్కరరామారావుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పెదపూడి మండలానికి ఆయన ఏమీ చేయలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేత మళ్లీ మన పార్టీలోకి రావాలని చూస్తున్నారు.. ఆయన వస్తే మేం వెళ్లిపోతాం.. అని పలువురు కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఈ సమయంలో పిఠాపురం ఇన్‌ఛార్జి వర్మ చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. చంద్రబాబు రాజప్ప వెను తిరిగి.. ఔనా రాజప్పా.. (బొడ్డు మళ్లీ మన పార్టీకి వస్తానంటున్నాడా?) అని ప్రశ్నించారు. రాజప్ప మాత్రం చంద్రబాబుకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా పెదపూడి మండలం నుంచి వచ్చిన పలువురు కార్యకర్తలు లేచి ఆయన వస్తే మేం వెళ్లిపోతాం.. నమ్మక ద్రోహి బొడ్డు వద్దు.. అంటూ నినాదాలు చేశారు. అతడ్ని మన పార్టీలోకి తీసుకోవడంలేదు తమ్ముళ్లూ? అని చంద్రబాబు అనడంతో కార్యకర్తలు శాంతించారు.

జెండాలు ఎన్నాళ్లు మోయాలి? టీడీపీ కార్యకర్తలు కసితో పనిచేసి టీడీపీ అభివృద్ధి, కాంగ్రెస్ తప్పుల్ని ఎక్కడికక్కడ ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ్ముళ్లూ వచ్చే ఎన్నికల్లో మనం గెలిచితీరాలి? లేకపోతే ఇంకా ఎన్నాళ్లు జెండాలు మోయాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

చిరంజీవి దెబ్బకొట్టాడు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని.. గత ఎన్నికలలో మాత్రం పీఆర్పీ పెట్టి చిరంజీవి మోసగించడం వల్ల టీడీపీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌ని గెలిపించడానికే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.