April 5, 2013

టీడీపీలో ఒక కుటుంబం.. రెండు టికెట్లు

డబుల్ ధమాకా!
కొందరికి చాన్స్.. క్యూలో మరికొందరు
రంగంలోకి వారసులు.. తమ్ముళ్లు

హైదరాబాద్ : టీడీపీలో కొందరు నేతల కుటుంబాలను డబుల్‌ధమాకా అదృష్టం వరిస్తోంది. ఈ అదృష్టం ఇప్పటికే కొందరికి దక్కగా.. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నాల్లో మరికొందరు ఉన్నారు. కొంతమంది సీనియర్లు ఈసారి తమకు తోడు వారసులను కూడా రంగంలోకి తెచ్చే వ్యూహాల్లో ఉండటంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేఈ సోదరులుగా ప్రసిద్ధి పొందిన కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని గెలిచారు. ఈసారి కూడా వారికే టికెట్లు ఖాయంగా కనిపిస్తోంది.

కాకపోతే కృష్ణమూర్తిని ఈసారి ఎంపీగా నిలబెట్టాలని పార్టీ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యాభర్తలు కొత్తకోట దయాకర రెడ్డి, కొత్తకోట సీత ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈసారి కూడా ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడమో లేదా సీత ఎంపీగా పోటీ చేయడమో జరిగే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నదమ్ములు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరికీ టికెట్లు వచ్చాయి. కానీ, ఇద్దరూ గెలవలేదు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మృతితో ఆయన కుమారుడు రామ్మోహన నాయుడు ఈసారి ఎంపీగా పోటీ చేయనున్నారు.

అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భార్యాభర్తలు రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, సుమన్ 'గిరిజన' వివాదంలో కోర్టు కేసుల్లో చిక్కుకొన్నారు. ఈసారి ఆమె బదులు కుమారుడు రితీష్ రాథోడ్ రంగంలోకి రాబోతున్నారు. ఆ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా రితీష్ చురుకుగా పాల్గొన్నాడు. ఇక, కొత్తగా ఈసారి రెండో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రముఖంగా కనిపిస్తోంది.

ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి తన కుమారుడు జగదీష్‌ను నగరి నుంచి రంగంలోకి దించి తాను చంద్రగిరి, పలమనేరు, మదనపల్లిల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఒకటే టికెట్ ఇస్తే తాను తప్పుకొని తన కొడుకును నిలుపుతానని, రెండోచోట అవకాశం ఇస్తే తానూ నిలబడతానని సన్నిహితులకు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఈసారి తనతోపాటు తన కొడుకు మల్లికార్జున రెడ్డికి కూడా సీటు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

అక్కడ ఇతరత్రా సీనియర్లు లేకపోవడం ఆమె ప్రయత్నాలకు కొంత సానుకూలంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి ఈసారి మరో టికెట్ వస్తోంది. ఆయన తమ్ముడు నరేందర్ రెడ్డి ఇప్పటికే పరిగి సీటుకు ఇన్‌చార్జిగా ఉన్నారు. మహేందర్ రెడ్డి భార్య సునీత పేరు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి పరిశీలనలో ఉంది. అదే జిల్లాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న దేవేందర్ గౌడ్ ఈసారి తన కుమారుడు వీరేశ్‌ను ఉప్పల్ అసెంబ్లీ సీటు నుంచి పోటీకి నిలపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదే జిల్లాలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తన స్థానంలో తన సోదరుడు తిరుపతి రెడ్డిని ఇప్పటికే నియోజక వర్గంలో పూర్తి స్థాయిలో తిప్పుతున్నారు. శాసన మండలిలో ఇటీవలి వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా ఈసారి రెండు సీట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కొడుకు రత్నాకర్ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.

దాడి వీరభద్రరావు అనకాపల్లి పార్లమెంటు సీటుకు పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాడి స్థానంలో మండలిలో టీడీపీ పక్ష నేత కాబోతున్న యనమల రామకృష్ణుడు కుటుంబానికి కూడా ఈసారి రెండో టికెట్ వచ్చింది. యనమల స్థానంలో ఈసారి తుని నుంచి ఆయన సోదరుడు పోటీ చేయబోతున్నారు. "ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయడానికి రాజకీయ, ఆర్థిక శక్తి ఉండాలి. నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు కలిసి రావాలి. గెలిచే అవకాశం ఉందనుకొంటే ఇవ్వడం తప్పు కాదు. కానీ, పలుకుబడి ఉందని ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది'' అని పార్టీలో సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు.