April 5, 2013

తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు

గొల్లప్రోలు: సిగ్గు, శరం, న్యాయం, ధర్మం వదిలివేసి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పర్యటించిన ఆయన బుధవారం రాత్రి సీతారామస్వామి దేవస్థానం సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కొందరు వ్యక్తులకు దోచిపెట్టి, వారి ద్వారా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన దొంగలందరూ నేడు చంచల్‌గూడా జైలులో ఉన్నారని తెలిపారు.

ఇంకా కొంతమంది దొంగలు సెక్రటేరియేట్‌లో మిగిలారని చెప్పారు. వారిని ఇంటికి పంపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన, అవినీతి దద్దమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. దీన్ని సముద్రంలో కలపాలని ఆయన పిలుపునిచ్చారు.

ధరల అదుపులో విఫలం నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాం కంటే ప్రస్తుతం 300 శాతం పైగా ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి గురించి ప్రభుత్వాధినేతలకు పట్టడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కిలో రూ.15 ఉన్న బియ్యం ధర నేడు రూ.45-50కు చేరిందని, పప్పుల ధరలు రూ.35 నుంచి రూ.80కి, చక్కెర రూ.12నుంచి రూ. 45కి, ఉప్పు రూ.2నుంచి 12, ఎరువుల్లో డీఏపీ బస్తా ధర రూ.425 నుంచి 1750కి, పొటాష్ బస్తా ధర 225 నుంచి 900కి పెరిగిందని వివరించారు. వ్యవసాయ ఖర్చులు 300 శాతం పైగా పెరగగా ధాన్యానికి మాత్రం కేవలం 30శాతం మాత్రమే ధర పెరిగిందన్నారు.

సాక్షి దినపత్రిక విషకన్య లాంటిదన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి మేపితే పాలు ఇ స్తుందా.. తిరిగి మనల్నే తన్నుతుంది అని చంద్రబాబు అన్నారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి లేదని తెలిపారు. ప్రజలు తమ జీవితాల్లో ఇన్ని కష్టాలు ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెల్టుషాపులను రద్దుచేయడంతోపాటు నిర్వాహకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు చెప్పారు.

హామీల వర్షం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు అంతటికి సాగునీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న ఈ పథకానికి నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఏలేరు ఆధునికీకరణ చేపట్టడంతోపాటు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందేలా చూస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఉల్లి, పత్తి తదితర పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధర లభించేలా చూ స్తామని తెలిపారు.

లారీలు, ఆటోలు, ట్యాక్సీలు ఇతర వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వారు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసేందుకు రాయితీపై రుణాలు అం దచేస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు విద్యార్హత నిబంధనను తొలగిస్తామని చెప్పారు. నేను చెప్పింది వాస్తవమైతే ఓటు వేయాలని కోరారు. ప్రజల్లో మార్పు, చైతన్యం రావాలని, ఎన్నికల రోజున ఓటు తనకు వేస్తే ఐదేళ్ల సేవకుడిగా సేవలందిస్తానని తెలిపారు.

బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, నాయకులు పోతుల విశ్వం, బవిరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు, మాదేపల్లి రంగబాబు తదితరులు పాల్గొన్నారు.