April 5, 2013

సంక్షోభాలు ఎదుర్కోని బలపడ్డాం

గొల్లప్రోలు: తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను దీటుగా ఎదుర్కొని మరింత బలపడిందని, నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గొల్లప్రోలు పట్టణ శివారు తాటిపర్తి రోడ్డు వద్ద గురువారం జరిగిన పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు తమ ఆలోచనలను కసిగా మార్చుకుని గట్టి నిర్ణయం తీసుకుంటే టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. టీడీపీలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఏ కులానికి ఎప్పుడూ పెద్దపీట వేయలేదని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అదే సమయంలో బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

రాజకీయంలో కులం పనిచేయతని స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థపరులు కులరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.ఎన్టీఆర్‌కు, తనకు కార్యకర్తల వల్లే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. ఆస్తులు తెగనమ్ముకుని సైతం సేవలు అందించారని కొనియాడారు. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పెదపూడికి చెందిన గుణ్ణం వీర్రాజు చౌదరికి అక్కడి నుంచే పార్టీకి సేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. కార్యకర్తలపై కేసులు బనాయిస్తే పార్టీయే అన్ని ఖర్చులు భరించి వారికి అండగా పోరాటం చేస్తుందని తెలిపారు. టీడీపీ ఒక కుటుంబం లాంటిదని, అందులో సభ్యులంతా తన కుటుంబ సభ్యులాంటివారన్నారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కంచుకోట అన్నారు.

గత ఎన్నికల్లో చిరంజీవి లేకుంటే మనకే అధికారం దక్కేదని తెలిపారు. ఆయన కాంగ్రెస్ సహాయ పడటానికే వచ్చినట్టుందన్నారు. రాష్ట్ర చరిత్రలో పార్టీలు పెట్టిన చెన్నారెడ్డి, బ్రహ్మనందరెడ్డి, ఎన్జీరంగా కొంతకాలం తర్వాత వాటిని కాంగ్రెస్‌లో కలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జైలు పార్టీ పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్‌లో కలవాల్సిందేనని చెప్పారు.

ఈ ఏడాది కీలకం ఏడాదిలోగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, అంతకంటే ముందుగా స్థానిక సంస్థలు, సాగునీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాదంతా ఎంతో కీలకమని ప్రతి ఎన్నికను గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలమని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల నుంచి సూచనలు స్వీకరిస్తున్నానని, దీనికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందరూ మనస్ఫూర్తిగా సూచనలు ఇవ్వాలన్నారు. ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పా రు. తిరిగి ఎస్ఎమ్ఎస్‌ల రూపం లో సమాచారం పంపడం అందరూ నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మంది కార్యకర్తల వివరాలను కంప్యూటరీకరించామని, మరో రూ.7-8లక్షల మంది వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా పలు చలోక్తులు విసిరారు. జిందాబాద్‌లు ఇప్పించడం నేర్పించిన నేతలు ఎస్ఎమ్ఎస్‌లు పంపడం మాత్రం నేర్పలేదని సరదాగా వ్యాఖ్యానించారు.

వెన్నా, చిక్కాల నిజాయితీపరులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు నీతి నిజాయితీలకు మారుపేరని, మూడుసార్లు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ వెన్నా నాగేశ్వరరావు నిజాయితీగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. సాధారణ కుటుంబాల్లో పుట్టిన వ్యక్తులను ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత టీడీపీదేనన్నారు. అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి మూలారెడ్డి అదే రీతిలో సేవలందించారని తెలిపారు. నీతి నిజాయితీలతో మచ్చలేకుండా పనిచేసిన వీరందరి పేర్లు చిరకాలం అందరి మనస్సుల్లో ఉండిపోయిందని చెప్పారు.

మీ చిట్టా ఇది సమీక్షలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు తెలపాలని కోరగా పలువురు తాము చేపట్టిన కార్యక్రమాలు గురించి ఏకరవుపెట్టారు. ఆ సమయంలో నియోజకవర్గాల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికను చంద్రబాబు బయటపెట్టారు. సొసైటీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో చదివి వినిపించారు.

సమర్థులకే టిక్కెట్లు పార్టీ పరంగా సమర్థంగా పనిచేసినవారికే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను ఆశించిన రీతిలో పనిచేయని వారికి నాలుగైదు సార్లు చెబుతానని, అప్పటికి మారకుంటే సదరు నాయకులనే మార్చివేస్తానని స్పష్టం చేశారు. మొహమాటంతో పార్టీని ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. ఏదో ఆవేశంలో పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడంలో తప్పులేదన్నారు. సమావేశంలో పిఠాపురం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.

పార్టీకి యువతను అనుసందానించాం సకుమళ్ల గంగాధర్ పిఠాపురం మండల తెలుగు యువత అధ్యక్షుడు

నియోజకవర్గంలో గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా యువతను సమీకరించి ఐదువేలమందితో యువశక్తిని తయారు చేశాం. వీరందరినీ పార్టీకి అనుసంధానించి టీడీపీ పటిష్టత కోసం పనిచేస్తాం.

టీడీపీ అభివృద్దిని ప్రచారం చేయాలి పిల్లి రవికుమార్, జిల్లా టీడీపీ కార్యదర్శి, పిఠాపురం తెలుగుదేశం హయాంలో జరిగిన ప్రగతిని ప్రచారం చేయాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి పార్టీ ఇన్‌చార్జి వర్మ పలు కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేయడమే గాక ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు.

కొత్త వ్యక్తుల రాకకు అడ్డంకులు కొండేపూడి ప్రకాష్, జిల్లా టీడీపీ కార్యదర్శి పార్టీలోకి కొత్త వ్యక్తులు వస్తుంటే మన నాయకులే అడ్డుకొంటున్నారు. మా ప్రాతినిధ్యం తగ్గిపోతుందని భయపడుతున్నారు.