April 5, 2013

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

హత్నూర : విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం పేద ప్రజలపై తీరని భారం మోపుతుందని టీడీపీ జిల్లా కార్యదర్శి ఎల్లాదాస్ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా దౌల్తాబాద్‌లో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లాదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. నిత్యం కూలి పని చేసుకునే ప్రజలు ఈ భారాన్ని మోయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రోజురోజుకు ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన విద్యుత్, చమురు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిఎడల ప్రజలను జాగృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎంఏ.హకీం, గుండ పురుషోత్తం, రాందాస్, అజీజ్, సజ్జత్, వాహాబ్, బాలలింగం, జనార్ధన్, శ్యామ్ పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో... నర్సాపూర్ : విద్యుత్ చార్జీల పెంపు, ఎడపెడ విధిస్తున్న కోతలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నర్సాపూర్‌లో సంతకాల సేకరణ నిర్వహించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని, విద్యుత్ కోతల సమయపాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ప్రజల సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవర వాసుదేవరావు, సీనియర్ నాయకులు గోపాల్‌రెడ్డి, పబ్బారమేష్, మాజీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు రఘువీరారెడ్డి, మల్లేశ్‌యాదవ్, పిట్ల సత్యనారాయణ, అంజాగౌడ్, విఠల్, అఖిల్, శ్రీనివాస్‌గౌడ్, మాధవరెడ్డి, కొండి కుమార్, సురేష్‌గౌడ్, సంతోష్‌గుప్తా, బాల్‌రాజ్, చింతకుంట ప్రభాకర్, హైదర్‌బేగ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.