January 26, 2013

పూలబాట


మండలంలోని నక్కలంపేట, పరిటాలలో శనివారం జరిగిన చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. బాబును పూలపై నడిపించారు. మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీసి, పాదయాత్ర విజయవంతం కావాలని హారతులిచ్చి దీవించారు. బాబు వెంట నడిచారు. ముస్లిం మహిళలు సైతం బాబును ఆశీర్వదించారు. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, ఒక బల్బు ఉన్నప్పటికీ వేలల్లో వస్తున్న బిల్లులు చూసి తట్టుకోలేకపోతున్నామని మహిళలు వాపోయారు. స్పందించిన బాబు టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు ఓపిక పట్టాలన్నారు. పైలాన్ ఆవిష్కరణకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తరలివచ్చారు. పైలాన్ వద్దకు బాబును, భువనేశ్వరిని పూలపై డిపించుకుంటూ తీసుకువెళ్లారు. పరిటాలలో జనస్పందన చూసి బాబు సంతోషం వెలిబుచ్చారు. పరిటాలకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నిజాంపై తిరుగు బాటు చేసి స్వతంత్ర గడ్డగా ఏర్పడిందన్నారు.

టీడీపీలో కూడా పరిటాలకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. 117 అడుగుల పైలాన్ నిర్మాణానికి రూ.20 లక్షలు విలువచేసే స్థలాన్ని వితరణగా అందజేసిన కోగంటి రామారావును, పైలాన్ ఏర్పాటు చేయించిన కేశినేని నాని, ఇంజనీర్ ఎస్.వి. రమణ, చావా రమేష్‌లను చంద్రబాబు సన్మానించారు. సభకు హజరైన అందరితో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధికి, పేదరికం నిర్మూలనకు కృషి చేస్తానని, అవినీతిని సమూలంగా నిర్మూలిస్తానని, దేశ సంపదను ఇతర దేశాలకు తరలించకుండా కాపాడతానని, ఇప్పటికే తరలించుకుపోతున్న లక్షల కోట్ల రూపాయలను దేశానికి రప్పిస్తామని, ప్రజా ఆస్తులను కాపాడతానని, శాంతి సౌభాగ్యాలను పరిరక్షిస్తానని అంటూ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నానని అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.