January 26, 2013

అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే టీడీపీ ధ్యేయం

అవినీతిపై పోరాడేందుకు యువత ముందుకు రావాలి
కంచికచర్ల గణతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు

అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాడే టీడీపీ ధ్యేయం అని, దీనిపై పోరాడేందుకు యువత ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 64వ గణంతత్య్ర దినోత్సవం సందర్భంగా కంచికచర్లలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి వల్ల పేదలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని ధ్వజమెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టను వ్యాపింపజేసిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సంస్కరణల్లో టీడీపీ ముద్ర ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, ఇందుకు కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ప్రకటించారు.

అసెంబ్లీ తొలి సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవినీతిపరులు ఎందటి వారినైనా వదలమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక పోరాటం జరిపితేనే అవినీతి అంతమవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

వేడుకల అనంతరం కంచికచర్లలో 117వ రోజు పాదయాత్రను బాబు ప్రాంభించారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.