January 26, 2013

చంద్రబాబు ఎట్‌థరేట్ఆఫ్ 1833.8

జనంతో కరచాలనాలు చేస్తూ.. వృద్ధులను పలకరిస్తూ ... రైతుల వెన్ను తడుతూ .. రైతు కూలీలకు భరోసా నిస్తూ.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు.. ప్రతి ఒక్కరికి.. 'మీకోసం'.. నేనున్నానంటూ.. మీ కష్టాలలో పాలుపంచుకుంటానంటూ.. అందరిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ స్తైర్యాన్ని కల్పిస్తూ సాగుతున్న ఆ బాటసారి ఇప్పటికి 1833.8 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. 3 నెలల 22 రోజుల క్రితం ఇల్లు వదిలిన ఆ పాదచారి యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అడుగులో అడుగు వేస్తూ.. ఒక్కోసారి కుంటుకుంటూనూ.. మరోసారి హుషారుగాను.. దీర్ఘాలోచనలో నిమగ్నమవుతూ .. మొక్కవోని ఆత్మస్థైర్యంతో మైళ్ళకు మైళ్ళు తిరుగుతున్న ఆ నాయకుడే చంద్రబాబు నాయుడు. వయసును లెక్క చేయకుండా... ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా.. తమతో మమేకమవటానికి, తమ బాధలను తెలుసుకోవటానికి గ్రామ గ్రామానికి వస్తున్న చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

64 ఏళ్ళ వయసులో ఆయన కష్టాన్ని చూడటానికి పిల్లలు, మహిళలు, వృద్ధులు పోటీలు పడి రోడ్ల మీదకు తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటలకు నిద్ర లేచే చంద్రబాబు తిరిగి విశ్రాంతి తీసుకునేది రాత్రి 12 గంటలకే. ఈ మధ్యలో సమయం అంతా పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దటానికి, పాదయాత్రలకే సరిపోతోంది. ఇల్లు వదిలిన తర్వాత ఈ నాలుగు నెలలుగా ఆయన నివాసం అంతా తన వెంట తిరుగుతున్న బస్సుల్లోనే. స్నానపానాదులు అన్నీ అందులోనే. భోజనం చేసినా, టీ తాగినా, మధ్యలో కాళ్ళు నొప్పులు పుట్టి కాసేపు సేద తీరాలన్నా ఆ బస్సే ఆయన నేస్తం. ఉంటే బస్సులో, లేకపోతే రోడ్లమీద. సగటున రోజుకు 15 నుంచి 17 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన పాదయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో భోజనం కోసం ఆగుతారు.

భోజనం చేసి ఒక గంట మా త్రం విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి 3.30 గంటల సమయంలో బస్సు దిగుతారు. అక్కడి నుంచి మళ్ళీ పాదయా త్ర మొదలు పెడతారు. సాయంత్రం దాదాపుగా 2 - 3 గంటలు నడిచాక టీ కోసం ఆగుతారు. అనంతరం టీ సేవించిన తర్వాత నడక ప్రారంభించే చంద్రబాబు ఆ రాత్రి బస చేసే క్యాంపు వరకు అలానే నడుస్తూనే ముందుకు సాగుతారు. రాత్రి పూట నడిచే సమయంలో ఆయన్ను చూసేవారు పడిపోతారేమో అన్న భావన కలుగుతుంది. అయినా ఆయన ఆలాగే నెమ్మదిగా అగులో అడుగు వేసుకుంటూ తనకు అభివాదం చేసే వారికి ప్రతి నమస్కారాలు చేస్తూ చేతులెత్తి సాగిపోతుంటారు. ఈ 15-16 కిలోమీటర్ల మేర జరిగే పాదయాత్ర సమయంలోనే కనీసం నాలుగు లేదా ఐదు బహిరంగ సభల్లో మాట్లాడతారు.

కొన్ని చోట్ల జనం ఎక్కువుగా ఉంటే గంటకు పైగా ప్రసంగిస్తారు. అన్ని కిలోమీటర్లు నడిచి కూడా మళ్ళీ 15 - 20 మెట్లు ఎక్కి ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆదే వేదికపై గంట సేపు నిలబడి ప్రసంగాలు చేస్తారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఆయన ఓపికను , ఇచ్చాశక్తిని చూసి యువ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం చంద్రబాబు పాదయాత్ర ఇప్పటికే ఆపవలసి ఉంది. అయినప్పటికీ ఆయన పాదయాత్రను కొనసాగిస్తానని అంటున్నారు. షుగ ర్ వ్యాధిని కూడా లెక్క చేయకుండా ప్రజల నుంచి వస్తున్న ఆదరాభిమానాలతో 'మీ రెవరైనా నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే వారం రోజులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, నేను మాత్రం విరామం అన్నది ఎరుగకుండా పాదయాత్ర చేస్తూనే ఉన్నాను. మీరు అనుభవిస్తున్న కష్టాల ముందు .. నా కష్టాలు ఓ లెక్క కాదు. మీకోసం.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటానికి నేను ముందుకు వెళుతూనే ఉంటాను' అంటూ పాదయాత్ర ఆపేది లేదని ప్రజలతో మమైకమైన సందర్భాలలో చెబుతున్నారు.