January 26, 2013

అవినీతి లేకుంటే అగ్రరాజ్యంగా భారత్

దేశంలో తొమ్మిది లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అవినీతి లేని పక్షంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కంచికచర్ల సమీపంలో దేవినేని రమణ ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి మిక్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. దేశంలో 2జీ స్ప్రెక్టమ్, కామన్‌వెల్త్ గేమ్స్, మైనింగ్ లీజుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. అవినీతి రహిత దేశం, ఆంధ్రప్రదేశ్‌గా తయారుచేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు చట్టాలు తీసుకురావాల్సి అవసరం ఉందన్నారు. చదువు ప్రాథమిక హక్కుగా ఉండాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, లేదా తల్లిదండ్రులకు భారం కాకుండ ఉపాధి చూపిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరంతరం శ్రమిస్తే నూరుశాతం విజయం సాధించవచ్చునని అన్నారు.

ఎన్‌టీఆర్ నిరంతరం శ్రమించటం వల్ల ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. రమణ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రమణ చిరస్మరణీయుడుగా నిలిచిపోయారన్నారు. నిన్నటి దాకా నాకు కాలు నొప్పి మాత్రమే ఉంది, నేటి నుంచి గొంతు నొప్పి ప్రారంభమైంది. సుగర్ కూడా వచ్చింది. ఇంతకు ముందు సుగర్ లేదు. రోజూ ఎక్కువ దూరం నడవటం వల్ల ఒత్తిడి పెరగడం వల్ల సుగర్ వచ్చిందన్నారు.

జనసంద్రంగా కంచికచర్ల పట్టణం కంచికచర్ల పట్టణం జన సంద్రంగా మారింది. శుక్రవారం రాత్రి 10.20 గంటలయినా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మర«థం పట్టారు. పెద్దయెత్తున బాణసంచా కాల్చారు. చెరువు కట్ట వద్ద నుంచి బస చేసే ప్రాంతం వరకు ఆయనను పూలపై నడిపించారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కంచికచర్ల చేరుకోవాల్సి ఉంది. కాలినొప్పి వల్ల మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. అయినా ఓపికతో కదలకుండ ఆయన కోసం ప్రజలు నిరీక్షించారు. పార్టీ కార్యకర్తలు, జనాలు ఊహించని విధంగా రావటంతో బాబు, నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.