January 26, 2013

మద్యంపై మహిళల మొర

పాదయాత్రలో భాగంగా మాగల్లు చేరుకున్న చంద్రబాబుకు కాపుసారా, బెల్ట్‌షాపులు, చీప్ లిక్కర్‌పై మహిళలు మొర పెట్టుకున్నారు. మాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు సమస్యలు చెప్పాలంటూ మహిళలకు మైక్ అందజేశారు. మహిళలు మద్యం వ్యాపారంపై మండిపడ్డారు. ఎన్ని ఉద్యమాలు చేసినా బెల్ట్‌షాపులు, కాపు సారా అరికట్టలేక పోతున్నామని, దీని వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, వాటి వల్ల భర్తలను తమను కొట్టి కూలీ డబ్బులు కూడా లాక్కుని మద్యం తాగేస్తున్నారన్నారు. యువకుడు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని, ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తుందన్నారు.

మరో రైతు మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలంపల్లి వద్ద మునేటిపై డ్యామ్ నిర్మాణానికి ముప్పై కోట్లు కేటాయించాడని, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు కలసి నిధులు గోల్‌మాల్ చేసి నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. ఆయకట్టులోని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కూడా మూలన పడే స్థితికి తీసుకువచ్చారన్నారు. సమస్యలపై స్పందించిన చంద్రబాబు రైతుల, మహిళల కష్టాలు తీర్చడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల ప్రభాకరరావు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, అర్బన్ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్ తదితరులు పాల్గొన్నారు.