January 25, 2013

నా డ్యూటీ నేను చేయాలి కదా!

ఎడమ కాలు ఇబ్బంది పెడుతోంది. పంటి బిగువున అడుగు వేశానేగానీ చాలానొప్పిగా ఉంది. ఆదిలాబాద్ యాత్రలో చిటికెన వేలుకు అయిన గాయం తిరగబెట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు చెప్పడం వాళ్ల విధి. ప్రతిపక్ష నేతగా నా డ్యూటీ నేను చేయాలి కదా!

నాటుసారా.. నా ఆడపడుచుల పుస్తెలను తెంచుతోంది. మాంగల్యభాగ్యమూ లేకుండా చేస్తోంది. చిన్నవయసులోనే వారిని చింతల్లోకి నెట్టేస్తోంది. కృష్ణా జిల్లాలోనే కాదు.. రాష్ట్రమంతటా అసంఖ్యాకంగా 'మైలవరా'లను విస్తరిస్తోంది. నాకు మంగళ హారతులు పడుతున్న ఆడబిడ్డలకు మంగళ సూత్రాలు లేకపోవడం కుంగదీస్తోంది. నా యాత్రను పసుపుమయం చేస్తున్న వీరిలో చాలామందికి పసుపు తాళ్లే గతవుతున్నాయి. ఎందుకిలా? అనుకుంటూ మాదెళ్లలో అడుగుపెట్టిన నాకు తొలి అడుగులోనే ఆమె జవాబు చెప్పేసింది. 'నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్'' అంటున్న ఒక మహిళ కేక ముందు వినిపించి.. ఆ తరువాత ఆమె రూపం కనిపించింది. పేరు సులోచన అని చెప్పింది.

"నాటుసారా మా కొంపలు కూలుస్తోంది. ఆ మహమ్మారి మా జీవితాలను చిదిమేస్తోంది'' అంటూ మొదలుపెట్టి ఆ మాయదారి ప్రాణాంతక వ్యసనంతో ఇల్లూ ఒళ్లూ గుల్లవుతున్న తీరును గొల్లుమంటూ కళ్లకు కట్టింది. "నా పెనిమిటి పచ్చి తాగుబోతు. తాగొచ్చి నన్నూ పిల్లల్నీ కొడతాడు. తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే ఎంతకైనా బరితెగిస్తాడు. పదిహేను రోజుల క్రితం మెడలో మంగళసూత్రం లాక్కుపోయాడు. ఇప్పుడు మా బాధ ఆయన తాగుతున్నాడని కాదు సార్.. ఎక్కడ ఆ నాటుసారా తాగి చస్తాడోనని. ఇప్పుడు పసుపుతాడు వేసుకొనైనా తిరగుతున్నాను. ఆయనే పోతే ఆ భాగ్యమూ ఉండదు సార్. ఏమి చేసైనా మమ్మల్ని ఆదుకోండి'' అంటూ రెండు చేతులూ జోడించి వేడుకుంటుంటే కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను చూడగలిగాను.

కూలి చేస్తే వచ్చే రూ. 150లో రూ.70నుంచి రూ.100 సారాకే పోతే ఇక పిల్లల చదువులు ఎలా? అద్దె ఎలా? కుటుంబ అవసరాలు ఎలా? అని బేలగా చూస్తుంటే, బెల్టుషాపుల రద్దు ఎంత అవసరమో నాకూ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది.