January 25, 2013

జగన్‌తో సీఎం కుమ్మక్కు

జగన్‌తో సీఎం కుమ్మక్కు
అందుకే సీబీఐకి ప్రభుత్వం సహకరించడం లేదు
కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
కృష్ణాజిల్లా పాదయాత్రకు బ్రహ్మరథం

విజయవాడ, జనవరి 24 : వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాలూచీ పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. "జగన్ కేసులో ప్ర భుత్వం సహకరించలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ మొర పెట్టుకు నే పరిస్థితి వచ్చింది. దీన్నిబట్టి కిరణ్ దొంగలను కాపాడటానికి ఎంతగా తంటాలు పడుతున్నాడో అర్థమవుతోంద''ని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఒక్కటేనని, ఒకటి దోచుకునే పార్టీ అయితే, మరొకటి దాన్నంతా కప్పిపెట్టి కాపాడే పార్టీ అని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా కొండూరు వద్ద ఆయన పాదయాత్రని ప్రారంభించారు.

పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా పాదయాత్రకు బయలు దేరేముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు. నందిగామలోకి ప్రవేశించే సమయంలో చంద్రబాబుకు కనీవినీ ఎరుగని రీతి లో అపూర్వ స్వాగతం లభించింది. దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పట్టణంలోని ప్రతి మేడ, ప్రహరీ గోడ.. అన్నీ ప్రజలతో నిండిపోయాయి. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆపివేయించి చంద్రబాబును చూసేందుకు బస్సు పైకెక్కారు. దీంతో.. నందిగామలో ఏర్పాటుచేసిన సభాస్థలికి రావడానికి చంద్రబాబుకు దాదాపు 45 నిమిషాలు పట్టింది. గురువారం రాత్రి నందిగామ గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

"ఆ రెండు పార్టీలూ ఒక్కటే! ఒకటి తల్లి కాంగ్రెస్, మరొకటి పిల్ల కాంగ్రెస్. ఒకడు దోచుకునే వాడు, మరొకటి ఆ దోపిడీ ముఠాను కాపాడే దొంగల పార్టీ. ఈ దొంగల ను రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలి'' అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. "దేశంలో అవినీతి పరులు కలుపు మొక్కల్లా తయారయ్యారు. కలుపు మొక్కలు తీయకపోతే పంట చేతికి రాదు. అంబేద్కర్, ఫూలే, వివేకానందుడు, మహాత్మాగాం«ధీ, ఎన్టీఆర్ వంటి యుగపురుషులు జన్మించిన గడ్డ ఇది. దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. రాష్ట్రాన్ని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది' అని పిలుపునిచ్చారు.

గొర్రెలకు ఉన్న విశ్వాసం కూడా రాజకీయ నేతలలో ఉం డటం లేదన్నారు. 30 ఏళ్లపాటు శ్రమించి నాయకులుగా తీర్చిదిద్ది ఎమ్మెల్యేలను చేస్తే సూట్‌కేసులకు అమ్ముడుపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన కాంగ్రెస్ అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, మహిళలు చివరికి వృద్ధులు.. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా జీవితాన్ని గడపలేని దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు.

సంక్షేమం పేరిట ప్రజలకు పప్పు బెల్లాలు పంచి వైఎస్ తన కొడుకు జగన్‌కు మాత్రం లక్ష కోట్లు దోచి పెట్టాడని దుయ్యబట్టారు. ధాన్యం లారీల మాదిరిగా ట్రక్కులలో డబ్బులు దోచుకుని వాటిని గుప్తనిధి లెక్క దాచిపెట్టారని ఆరోపించారు. గాడి తప్పిన పరిపాలనను తిరిగి మంచి మార్గంలోకి తీసుకు రావడం టీడీపీకి మాత్రమే సాధ్యమని చెప్పారు.