January 26, 2013

కాంగ్రెస్ పాలనలో రైతు జీవితం దారుణం

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, గిట్టుబాటు ధరలు లభించక రైతులు అల్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 10.20 గంటలకు చంద్రబాబు కంచికచర్ల చేరుకున్నారు. స్థానిక ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేయగా, నీలం తుపాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఒక్కరికి కూడా సాయమందించలేదన్నారు. పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని, సీసీఐ వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. క్వింటాకు ఐదు వేల తగ్గకుండా ధర ఇవ్వాలన్నారు. సాగునీటి ఎత్తిపోతల పథకాలను సైతం మూలనపడేశారన్నారు. ప్రస్తుతం సాగునీరు అందక పంటలు నిలువునా ఎండుతున్నాయని చెప్పారు. రైతుల పరిస్థితి దుర్లభంగా ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు.

కరెంట్ ఇవ్వకపోయినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో వేస్తున్నారు. సర్‌చార్జీల పేరుతో పేదలపై పెనుభారం మోపుతున్నారన్నారు. వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదని, ఇళ్లకు అయితే కరెంట్ ఉండటం లేదని, ఇప్పటికే 29 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు ఇవ్వటంతో పాటుగా రైతుల రుణాలను మాఫీ చేయవచ్చునని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పక్షంలో చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రజల సంపద ఇసుకను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారిని విడిచిపెట్టి, పక్షపాతంతో పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టటమేమిటని ప్రశ్నించారు. తనపై కూడా కాంగ్రెస్, వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులకు వెళ్లారని అన్నారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు.

వృద్ధులకు ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా, నెలకు ఆరు వందల రూపాయల వంతున పింఛను ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్యం సహకరించక పోయినా పాదయాత్ర కొనసాగించాలని ఉందని ఆయన తెలిపారు. అగ్రవర్ణాలలో పేదలకు ఉచితంగా విద్యతో పాటుగా కొలువు దొరికేంత వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా భృతి చెల్లిస్తామన్నారు. ముఖ్యంగా అవినీతి, ఇతర సమస్యలపై ప్రజలతో ఆయన కొద్దిసేపు ముఖాముఖి చర్చ నిర్వహించారు. అనంతరం రాత్రి 12.10లకు బస చేయడానికి వెళ్ళిపోయారు.