January 26, 2013

నీతిమంతుడిగా జగన్ పోజు..

ఈ సీఎంకు సిగ్గు లేదు!
మాఫియాతో మిలాఖత్.. దొంగలకు దాసోహం
అవినీతి నేతలకు ఆశీస్సులు.. కిరణ్‌పై బాబు ధ్వజం
పిల్లపాములకే విషం ఎక్కువ
రాష్ట్రాన్ని దోచే దొంగలను తరిమికొడదాం..రండి
కృష్ణాజిల్లా పాదయాత్రలో పిలుపు
నేటితో ముగుస్తున్న 'షెడ్యూల్''పాదయాత్ర

  "రాష్ట్రంలో అవినీతి దొంగలు పడ్డారు. కాంగ్రెస్ తల్లిపాము అయితే, వైసీపీ పిల్లపాము. పెద్ద పాములలో కంటే కూడా చిన్న పాముల్లోనే ఎక్కవ విషం ఉంటుంది తమ్ముళ్లూ.. అధికారం కోసం రాష్ట్రంలో దొంగల ంతా విడిపోయారు. ఈ దొంగలకు కిరికిరి సీఎం కిరణ అండగా ఉంటున్నారు. కాంగ్రెసోళ్లంతా దొంగలు. వైసీపీ వాళ్లూ దొంగలే. దొంగలంతా లోపాయికారీగా కలిసికట్టుగా ఉంటున్నారు. మనమంతా మంచివాళ్లం. చేతకానివాళ్లలా మిగిలిపోయాం. మంచివాళ్లంతా ఏకమై ఈ అవినీతి దొంగలను తరిమి కొట్టకపోతే రాష్ట్రం బాగుపడదు.'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. జాతీయరహదారి మీదుగా అంబారుపేట, ఐతవరం గ్రామాలలో 15 కిలోమీటర్లు నడిచారు. అవినీతిపరుడైన జగన్ నీతిమంతుడిలా పోజులు కొడుతున్నాడన్నారు. ఇలాంటి అవినీతిపరులను లోకాయుక్త , లోక్‌పాల్ ఏమీ చేయలేవని ఒక జడ్జి అన్నారని గుర్తుచేశారు. కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి ఒకరు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారన్న దానిపై బర్తరఫ్ చేయాలని జస్టిస్ వర్మ సూచించినా ముఖ్యమంత్రి, ఆ మంత్రికి కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు. ఐతవరం సభలో నేతల అవినీతిపై విరుచుకుపడ్డారు. అవినీతిపరులకు అండగా ఉండేవారు కూడా అవినీతి పరులేనని చెప్పారు.

రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ మాఫియాలన్నింటికీ కిరణ్ సర్కారు అండ దండలందిస్తోందని ఆరోపించారు. పత్తి, వరి, మిర్చి , మొక్కజొన్న పంటలకు సాగర్ నుంచి నీరు రాకపోవటం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. సాగర్ నుంచి నీళ్లు రావటం లేదని, దేవినేని రమణ వేదాద్రి నుంచి నీళ్లు తెప్పించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభిస్తే.. అది కూడా పనిచేయటం లేదన్నారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాల్సి ఉం దని, పరిశ్రమలు రావాలంటే కరెంట్ ఉండాలని, కానీ ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.

" మీకోసం ప్రాణ త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాన''ని కంచికచర్ల మండలం కీసరలో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంతో పలికారు. కాగా, అంబారుపేట మీదుగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో చంద్రబాబు మధ్యలో ఐతవరం దళిత వాడలోకి వెళ్లారు. కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వాటిని కట్టలేకపోతున్నామని దళితులు.. బాబు దృష్టికి తీసుకు వచ్చారు. పాదయాత్ర మార్గమధ్యంలో ముస్లింలకు చంద్రబాబు మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలిపారు. వారు అందించిన సున్నుండలను అక్కడే ఉన్న విద్యార్థినులకు తినిపించారు.