January 26, 2013

వారిదీ ఒక బతుకేనా..


జగన్ అవినీతి సొమ్ము కోసం పార్టీలు మారుతున్న నాయకులది కూడా ఒక బతుకేనా.. ఆటువంటి నీచానికి పాల్పడడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పాదయాత్ర సందర్భంగా మండలంలోని ఐతవరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు. జగన్ వద్ద లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఉందని, అందులో కొంత దండుకోవచ్చని విలువలకు తిలోధకాలిచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారన్నారు. జగన్ ఇంటి వద్ద సూట్‌కేసులు తీసుకుని నేరుగా చెంచల్‌గూడ జైలుకు వెళ్లి కలుస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి చూసి న్యాయమూర్తులే విస్మయం వ్యక్తంచేస్తుంటే ప్రజాప్రతినిధులయివుండి కనీస జ్ఞానం లేకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో లోక్‌పాల్, లోకాయుక్తలు ఏం చేస్తున్నాయని కోర్టులు ప్రశ్నించాయన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి పరులను ప్రోత్సహిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. వాన్‌పిక్ కేసులో ఐదో ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మానప్రసాధరావును, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఈసీని మోసం చేసి మంత్రి సారథిని సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామానికి చెందిన మువ్వా నాగమణి అనే మహిళ మాట్లాడుతూ బెల్ట్ షాపులు ఎత్తి వేయాలని కోరింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకుంటే మహిళలంతా మీవెంటా ఉంటారన్నారు. స్పందించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులు, కాపుసారా అరికడతానని హామీ ఇచ్చారు.

నీరసంగా కనిపించిన బాబు వస్తునా.. మీకోసంలో శుక్రవారం చంద్రబాబు నీరసంగా కనిపించారు.

ఉదయం 11 గంటలకు బస్సు దిగిన చంద్రబాబు ప్రారంభం నుంచి కుంటుతూనే నడుస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు కూడా కాలు సహకరించకపోవడంతో వర్షపు నీరు ప్రవహించేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్‌లో నుంచి నడచి రోడ్డు దాటారు. ఎక్కడ ప్రజలు కనిపించినా కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడుతూ నడకసాగించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చేందుకు తోపులాటలో జరగడంతో ఆయన ఎడమ కాలును తొక్కడంతో చిటికెన వేలు కొంత బాధించింది. కొంత వాపు కన్పించింది. శుక్రవారం అంతా చంద్రబాబు అలసటగా కనిపించారు.

పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్ కలవగా ముస్లింలందరికీ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపారు. ఐతవరం వద్ద బాబును కలసి ముస్లిం టోపి పెట్టి శాలువాతో సత్కరించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.