January 26, 2013

కొందరి చేతుల్లోనే ఆర్థిక వనరులు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలు అయినా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు తొలగిపోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన కేసీఆర్ అండ్ ఎస్ఎస్ క్లబ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. పేదలకు చెందాల్సిన ఆర్థిక వనరులు కొంత మంది చేతుల్లోకి వెళుతున్నాయన్నారు. ఆడపిల్లలకు రక్షణ కరువైందని, అవినీతి ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నదన్నారు. అవినీతిపై పోరాటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, అందుకు అందరూ కలిసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ పార్టీలో అయిన అవినీతి పరులంటే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ చీకటి పాలనలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయని, అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతకుముందు జాతీయ నాయకులు గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.