January 26, 2013

అవినీతి మబ్బులను పారదోలుతుంది

'మార్పు' గాలి వీస్తోంది!
అదే ఝంఝామారుతవుతుంది
రాష్ట్ర ప్రభుత్వమూ మారొచ్చు
కృష్ణా జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
యాత్ర కొనసాగించాలని నిర్ణయం



తొమ్మిదేళ్లుగా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను కారుమబ్బులు కమ్ముకున్నాయని, పారిశ్రామిక ఆర్థిక ప్రగతి నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాల రీత్యా ప్రభుత్వం మార్పు దిశగా గాలులు వీస్తున్నాయని, పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే ఇందుకు సాక్ష్యమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ గాలులు ఝంఝా మారుతమై రాష్ట్రాన్ని అవహించిన అవినీతి మబ్బులను పారద్రోలతాయన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో ఉన్న ఆయన, కృష్ణాజిల్లా కంచికచెర్లలో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభవేళ అవినీతి అంతానికి ప్రతిఒక్కరూ ప్రతిన పూనుదాం అని మీడియాకు పంపిన సందేశ ప్రసంగంలో పిలుపునిచ్చారు. గడిచిన తొమ్మిదేళ్ల రాష్ట్ర పరిపాలనా కాలాన్ని ముందుతరాల చర్రితకారులు అవినీతి స్వర్ణయుగంగా అభివర్ణిస్తారనడంలో ఏ మాత్రం సందేహాం లేదని చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాపగ్గాలు చేపట్టడంతో ఈ యుగం మొదలైందని విమర్శించారు.

అవినీతి మహమ్మారి రాష్ట్రంలోని వ్యవస్థలన్నీంటిని నిర్వీర్యం చేసిందని, ఆర్థిక సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల మోత, పెట్రోల్ ధరల వడ్డన తదితర చర్యలతో కిరణ్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని, వంట గ్యాస్ ధరను సామాన్యులు భరించలేనిస్థాయికి కిరణ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మామూలు జ్వరాలకు మందుల్లేని దయనీయస్థితి నెలకొందన్నారు.

ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు మారాలని టీడీపీ త్రికరణశుద్ధిగా కోరుకుంటుందన్నారు. అత్యున్నతస్థాయిలో అవినీతిని నిర్మూలిస్తే అట్టడుగున ఉన్న అవినీతి తనంతట తానే మాయమవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడితే తమను అడిగేవారెవరని అగ్రస్థానంలో ఉన్న నేతలు విశ్వసిస్తున్నందున ఈ దుస్థితి దాపురించిందని వివరించారు. అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుస్తానని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరే అధికారాన్ని ప్రజలకు అందిస్తామని, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు. మచ్చలేని వ్యక్తిత్వం, నీతినిజాయితీ కలిగిన న్యాయశాస్త్ర కోవిదులను ఆ కోర్టులకు జడ్జిలుగా పంపుతామని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు జరిగిన అవినీతిని, ప్రజా ధనం లూటీని వెలికితీసి అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అవినీతి నిరోధక చట్టాన్ని అమలులోకి తెస్తామని తెలిపారు. తొలి శాసన సభ సమావేశంలోనే ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామన్నారు. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజలంతా తనపైన, తెలుగుదేశం పార్టీపైన చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని భావోద్వేగంతో పలికారు.

యాత్రకు ఒకరోజు బ్రేక్

పాదయాత్ర 117వ రోజు నేపథ్యంలో, పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబును ప్రజలు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ముందు ససేమిరా అన్న బాబు చివరకు ప్రజాభీష్టానికి తలొగ్గారు. వైద్య పరీక్షల కోసం ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇది తాత్కాలిక విరామమేనని, పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.

ఏమి చేతును సారు?
బాబు సమక్షంలో కన్నీరు పెట్టిన రైతు

"వాతావరణం సహకరించట్లేదు. సాగర్ నీరు ఇవ్వట్లేదు. నీలం తుఫాను ముంచేసింది. పొలంలో నాటిన పంట వెక్కిరిస్తోంది. కరెంటు సమస్య పీడిస్తోంది. సర్కారు ధరల మోత కుంగదీస్తోంది. ఇక నేను ఏమి చేతును సారూ'' అంటూ ఓ పత్తి రైతు.. చంద్రబాబు సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆత్మహత్యే గతి అంటున్నప్పుడు బాబు సహా అక్కడ ఉన్నవారంతా చలించిపోయారు.

పాదయాత్రలో భాగంగా బాబు శనివారం పరిటాల పత్తి కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఈ ఘటన జరిగింది. పరిటాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డులో గుట్టలు గుట్టలుగా పోసి ఉన్న పత్తి మూటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. దిగుబడులు బాగా వస్తాయని ఆశించి కొనుగోలు చేసిన మహాజన్ పత్తి విత్తనాలు తమ కొంపలు ముంచాయని రైతులు వాపోయారు. అంతల ఒకరైతు.. ఆశించిన దిగుబడి రాక, నాణ్యత లేని పత్తి విత్తనాల కొనుగోలు వల్ల కోలుకోలేని దెబ్బ తిన్నానని ఇలా కుమిలిపోయాడు.