January 26, 2013

ముగింపా.. ముందుకా..!

బాబు పాదయాత్రపై తర్జనభర్జన
నేడు కీలక ప్రకటన

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు ముహూర్తానికి వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం.. గత అక్టోబర్ రెండో తేదీన అనంతపురంలో మొదలైన ఆయన యాత్ర షెడ్యూల్ ప్రకారం శనివారంతో పూర్తి కావాలి. అప్పటికి ఆయన 117 రోజులు పూర్తి చేసుకొంటారు. ఆ తర్వాత ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాలి నొప్పి బాగా బాధిస్తుండటంతో కొంత విరామం ఇవ్వాలని పార్టీ నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నారు.

నిజానికి వాస్తవ పరిస్థితి కూడా వారి ఆందోళనకు తగినట్టే ఉంది. అడుగు తీసి అడుగు వేయడమే చంద్రబాబుకు ఇప్పుడు కష్టంగా మారింది. గత రెండు రోజులుగా పదే పదే నడకకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. తిరగబెట్టిన కాలి గాయానికి గొంతు సమస్య కూడా జత కలవడంతో ఆయన ఆరోగ్యం విషయమై సీనియర్లు తీవ్రంగా కలవరపడుతున్నారు. అయినా, చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పాదయాత్ర కొనసాగింపునకే నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం తనను కలిసిన పార్టీ అగ్రనేతల నుంచి కుటుంబ సభ్యుల దాకా.. అందరికీ ఆయన ఇదే విషయం స్పష్టం చేసినట్టు సమాచారం.

చంద్రబాబు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, గత రెండు రోజులుగా చంద్రబాబు కాలి నొ ప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల క్రితం ఆయన కాలి చిటికెన వేలు నలిగింది. విశ్రాంతి ఇవ్వకపోవడంతో అది మానడం లేదు. రెండు రోజులుగా నొప్పి ఎ క్కువ కావడంతో మధ్య మధ్యలో ఆయన కాసేపు కూ ర్చుని మళ్ళీ నడుస్తున్నారు. వాతావరణంలో మార్పుతో గొంతు ఇన్‌ఫెక్షన్ వచ్చి స్వరం నీరసపడింది. మధుమే హం హెచ్చు తగ్గులకు లోనవుతుండటంతో మనిషి కూడా నీరసించారు. దీంతో, మూడు నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకొంటే మళ్లీ పాదయాత్ర కొనసాగించవచ్చని పార్టీ నేతల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది.

వైద్యులు కూడా విశ్రాంతి అవసరమని గట్టిగా చెబుతున్నారు. ముందు అనుకొన్న గడువు పూర్తయినందువల్ల యాత్రకు కొంత విరామం ఇచ్చి రెండో విడత పెట్టుకొంటే బాగుంటుందని కొందరు సీనియర్లు..చంద్రబాబును కో రారు. కాని చంద్రబాబు ఆ ఉద్దేశంలో లేరు. శ్రీకాకుళం వ రకూ తన యాత్రను ఇదే ఊపులో కొనసాగించాలని ఆ యన గట్టి పట్టుదలతో ఉన్నారు. "ఎన్ని రోజులు నడవగలమో చూద్దాం. నడవగలిగినంతవరకూ ఆపేది లేదు. న డవలేని పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం' అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఆలోచన ప్రకారం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాల్సి ఉంది.

"ఆయన ఇంత మొండి మనిషని మేం ఊహించలేదు. ఆయన పడుతు న్న ఇబ్బంది బయటకు కనిపిస్తున్నదానికంటే చాలా ఎ క్కువగా ఉంది. అయినా మరో రెండు నెలలపాటు యా త్ర కొనసాగింపునకు ఆయన మానసికంగా సిద్ధమై పో యారు'' అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం విజయవాడకు వచ్చారు. రాత్రి ఏడు గంటల సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కుటుంబ సభ్యులు కలిశారు. పాదయాత్రను వాయిదా వేసే విషయమై బాబు చర్చించినట్లు తెలిసింది.