January 27, 2013

అడుగు మునుముందుకే..

ఈ రెండు రోజులకు ఈ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. కుల మతాలు, జాతి వర్ణాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ పవిత్రంగా భావించే రోజులివి. అందుకే ఈ రెండు రోజులను దృష్టిలో పెట్టుకొని 117 రోజులపాటు ప్రజల్లో మమేకం కావాలని, వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాలని నేనీ పాదయాత్ర ప్రారంభించాను. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన చూశాక ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన తరుణం ఇదేనని అడుగు ముందుకేశాను. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే, అది రాజకీయ స్వాతంత్య్రమే. పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇంకా రాలేదనే విషయం పాదయాత్రలో మరోసారి అర్థమయింది.

ఇప్పటికి కొన్ని వందల గ్రామాలు తిరిగాను. కొన్ని లక్షలమంది గుండెచప్పుళ్లు విన్నాను. ఎవరినీ కదిలించినా కష్టాలూకన్నీళ్లే. ఎవరి జీవితాలు చూసినా అధఃపాతాళాల్లోనే. రాష్ట్రంలో అసలేమి జరుగుతుందో తెలియనివారు కొందరు.. తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతలో మరికొందరు ఉన్నారనిపించింది. వారంతా చేయూత కోసం కళ్లలో వత్తులు వేసుకొని చూడటం గమనించాను. రైతులు, మహిళల నుంచి యువత, ఉద్యోగుల దాకా, ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రశాంతంగా లేదు. కులవృత్తులు, చేతివృత్తులు చితికిపోయాయి.

ఎవరిని కదిలించినా కన్నీళ్లే తప్ప ముఖంలో కళ లేదు. దీన్నంతా చూసిన తరువాతే 30 ఏళ్లు ప్రజల ఆదరణ పొందిన ఒక సీనియర్ నేతగా వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉందనిపించింది. ఈ క్రమంలో ఎన్ని కష్టనష్టాలొచ్చినా నడక ఆపొద్దని ఆనాడే నిశ్చయించుకున్నాను. కాలి చిటికెనవేలు నుంచి గొంతు సమస్య వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే నా సంకల్పం. ఇన్నాళ్లు తిరిగిన తరువాత ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి పల్లెని, పట్టణాన్ని పాఠశాలగా భావించాను. ఇకముందూ ఈ అభ్యాసం, అధ్యయనం కొనసాగుతాయి. అది ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి.