January 27, 2013

బాబుకు ప్రత్యేక వైద్యబృందం పరీక్షలు

నేడూ విరామమే!
నేడు మరోసారి పరీక్షలు చేయాలని నిర్ణయం
అంగీకరించిన చంద్రబాబు.. ఒక్కరోజు వాయిదా
పరీక్షల తరువాత యాత్రపై
నిర్ణయం తీసుకుంటాం: ఉమా, గరికపాటి

కాలినొప్పితో తీవ్రంగా బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో రోజు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సోమవారం కూడా ఆయనకు పరీక్షలు కొనసాగించాల్సి ఉంటుందని బృందం అభిప్రాయపడటంతో మరోరోజు పాదయాత్రను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆ తరువాతే పాదయాత్ర కొనసాగింపు గురించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారమిక్కడ ప్రకటించారు.

ప్రస్తుతం పరిటాలలోని జాతీయ రహదారి పక్కన గల స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని 'గ్రీన్‌వే'లో ఆయన బస చేశారు. ఆయనకు ప్రత్యేకించిన బస్సులో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేశ్, డయాబెటిక్ డాక్టర్ సురేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ మధులిక వైద్య పరీక్షలు నిర్వహించారు. నొప్పులతో పాటు షుగర్ లెవల్స్ పెరగటంతో వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇప్పటికిప్పుడు ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ పాదయాత్ర వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెప్పారు.

కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండడంతో పాదయాత్ర కొనసాగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారని, విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారని చెప్పారు. అయినా, పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు బాబు అంగీకరించటం లేదని గరికపాటి మోహనరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల కోసం శక్తి ఉన్నంత వరకు పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారన్నారు. సోమవారం వరకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు పేర్కొన్నారు.