January 27, 2013

బోసిపోయిన శిబిరం


లలా సందడిగా ఉండే చంద్రబాబు పాదయాత్ర శిబిరం ఆదివారం బోసిపోతూ కనిపించింది. శిబిరం వద్దకు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు గాని శిబిరం వైపు తొంగి చూడలేదు. బాబు కూడా రోజంతా బస్సులోనే గడిపారు. శిబిరం బయట పోలీసులు, లోపల మీడియా హడావుడి తప్పితే అంతటా నిశబ్ద వాతావరణం నెలకొన్నది. వస్తున్నా మీకోసం అంటూ అక్టోబర్ రెండు నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 117వ రోజుకు జిల్లాలో కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్న సంగతి విదితమే. ఎడమ కాలు చిటికెన వేలు పుండు మానకపోవటం, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, గొంతు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు ఆదివారం పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించి, ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారి పక్కన గ్రీన్‌వేలో శనివారం రాత్రి బస చేశారు.

బోసిపోయిన శిబిరం ఒక యజ్ఞంలా సాగుతున్న పాదయాత్రలో ప్రారంభం నుంచి ఐదు వందల మంది పాల్గొంటున్నారు. మొత్తం 25కు పైగా వాహనాలు ఉంటున్నాయి. సాధారణంగా రాత్రి బస చేసే శిబిరం వద్ద తెల్లారి పాదయాత్ర మొదలు పెట్టే వరకు చంద్రబాబును కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, చూసేందుకు వచ్చే కార్యకర్తలతో కోలాహలంగా ఉంటుం ది. అలాంటిది గ్రీన్‌వేలో ఏర్పాటు చేసిన శిబిరం ఆదివారం ఉదయం బోసిపోతూ కనిపించింది. ఏ మా త్రం సందడి లేదు. అక్కడి వాతావరణం నిశబ్దంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్థానిక విలేకరులు, పోలీసులు తప్పితే పార్టీ నాయకులు గాని, ఇతరులు గాని శిబిరంలోకి అడుగుపెట్టలేదు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలకు మాట్లాడేందుకు కూడా ఎవరూ దొరకలేదు.

పార్టీ నాయకులు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాలేదు. ఇక బాబు కూడా బస్సులో నుంచి బయటకు రాలేదు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. దీనికితోడు చంద్రబాబును చూసేందుకు కంచికచర్ల, పరిటాలకు చెందిన పలువురు కార్యకర్తలు వచ్చినప్పటికీ పోలీసులు శిబిరంలోకి అనుమతించ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం శిబిరం వద్దకు వచ్చినప్పటికీ చంద్రబాబును కలవలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు ఒక్కరే చంద్రబాబును కల్సి మాట్లాడారు.

బస్సులోనే వైద్య పరీక్షలు హైదరాబాదు నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ రాకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ ముధులిక బస్సులోనే చంద్రబాబుకు బీపీ, సుగర్, ఈసీజీ ఇతర వైద్యపరీక్షలు నిర్వహించారు. పాదయాత్ర చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రజల కోసం పాదయాత్ర చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు ససేమిరా అంటున్నారు. కనీసం మూడు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

నేడూ విరామం బాబుకు సోమవారం మరి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నందున పాదయాత్రకు మరొక రోజు విరామం ప్రకటించినట్టు గరికపాటి మోహనరావు, దేవినేని ఉమా మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర కొనసాగించేది, లేదా విరా మం ఇచ్చేది సోమవారం సాయంత్రం ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో సోమవారం కూడా బాబు గ్రీన్‌వేలోనే బస చేయనున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు సోమవారం హరికృష్ణ గాని బాలకృష్ణ గాని వస్తారని ప్రచారం సాగుతుండగా, సాయంత్రం వరకు తమకు ఏలాంటి సమాచారం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.