June 26, 2013

సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చుంటే స్వాగతించేవారం

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు తాము ప్రత్యేక విమానం పెట్టినందుకే ప్రభుత్వం తమకు పోటీగా విమానం ఏర్పాటు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఉంటే స్వాగతించేవారమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకు తాను ఉత్తరాఖండ్‌లోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న తెలుగువారందరినీ రాష్ట్రానికి చేర్చే బాధ్యత తమదేనన్నారు. డెహ్రాడూన్‌ నుండి విశాఖ వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌ తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

బుధవారం డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చార్‌ధామ్‌ యాత్రికులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదట పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉంటే తాము ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే అవసరమే వచ్చేది కాదన్నారు. తమకు వనరులు లేక పోయినా యాత్రికులను ఆదుకునేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామన్నారు.

విహెచ్‌ది అత్యుత్సాహం ః

టీడీపీ నేత టీడీ జనార్ధనరావు కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు అన్నారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.