June 26, 2013

బాధితుల తరలింపులో.. నేతల బురద రాజకీయం..!

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను తరలించడంలో కాంగ్రెస్, తెదేపా ఎంపీల మధ్య పోటీ నెలకొంది. డెహ్రాడూన్ విమాన్రాయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెదేపా ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరి మధ్య తోపులాట చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వీరిని అదుపుచేశారు. ఈ ఘటనతో బాధితులు అయోమయానికి గురయ్యారు. ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు… అదే విమానంలో బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిందని బాధితులను మేము తరలిస్తామని కాంగ్రెస్ నేతలు అడ్డుపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన కేంద్ర మంత్రి బలరాం నాయక్, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో జరగడం విశేషం. నేతల మధ్య పోటీతో యాత్రీకులు సైతం రెండు విడిపోయి నినాదాలు చేసినట్లు సమాచారం. యాత్రీకులను తరలించడం మాట అటుంచితే.. ఏపీ రాజకీయ నేతల వాగ్వాదంతో తెలుగు వారి పరువును మాత్రం తీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.