June 26, 2013

చంద్రబాబును చూసి గర్వపడుతున్నాం: నన్నపనేని

'ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చొరవ చూపి సహాయం అందించిన చంద్రబాబు నాయుడును చూసి తెలుగుదేశం పార్టీలో మేం అంతా గర్వపడుతున్నాం. ఆయనను అభినందిస్తున్నాం. ఆయనను అనవసరంగా కాంగ్రెస్ నాయకులు విమర్శించాలని చూస్తే సహించేది లేదు' అని టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. బుధవారం ఆమె ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు తమ పదవులు, రాజకీయ ఎత్తుగడల కోసం తిరుగుతున్నారని, చంద్రబాబు వెళ్ళడం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక అయినా వచ్చి బాధితులను పట్టించుకోవడం మొదలు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు.

'ముగ్గురు మహిళా మంత్రులు రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొన్న మహిళల పరిస్ధితి ఎలా ఉందో పట్టించుకోలేదు. బాధితులను పరామర్శించలేదు. మగవారు గోచీ పెట్టుకొని అయినా తిరగగలరు. మహిళల పరిస్ధితి అది కాదు. వారికి కనీసం కట్టుకోను చీర ఉందో లేదో కూడా పట్టించుకోలేదు. ఒక మహిళా మంత్రి పనబాక లక్ష్మి తన నియోజకవర్గానికి చిరంజీవిని తీసుకువెళ్ళి అక్కడ సంబరాలు చేస్తోంది. ఇదేనా వీరి బాధ్యత? ఉత్తరాఖండ్ విలయం భోపాల్ ఘటనను మించిందని అంటుంటే ప్రభుత్వంలో ఉన్నవారి స్పందన చాలా నాసిగా ఉంది. అధికారం, ముఠా కుమ్ములాటలపై ఉన్న శ్రద్ధ బాధితులపై లేదు' అని ఆమె విమర్శించారు.