June 26, 2013

బాబు వెనుక కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తెలివైన వాడు. సైలెంట్ గా తన వ్యవహారాలు తాను చక్కబెట్టుకోవడంలో దిట్ట. అయితే చంద్రబాబు ఇంకా తెలివైనవాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఆయన అందరికన్నా ముందుంటారు. ఉత్తరాఖండ్ దుర్ఘటన ప్రభావాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా అంచనావేయలేకపోయారు. పైగా ఎవరో కొందరు పర్యాటకులు వెళ్లి వుంటారు. చిక్కుకుని వుంటారు. అధికారులు చూసుకుంటారు అని ధీమా పడ్డారు. ఆయనే కాదు పర్యాటక మంత్రి చిరంజీవి కూడా ఫొటోలకు ఏరువాక ఫోజులిస్తూ, కాలక్షేపం చేశారు. అయితే ముందు దూకడంలో, జనాల్ని ముందుకు దూకించడంలో అద్భుతంగా వ్యవహరించగల మేనేజ్ మెంట్ గురూ.. చంద్రబాబు ఉత్తరాఖండ్ వ్యవహారాన్ని సరిగ్గా పసిగట్టాడు. క్షణాల్లో ఢిల్లీ చేరిపోయారు. హడావుడి చేశారు. ఆంధ్రాభవన్ లో హల్ చల్ చేసారు. చంద్రబాబు సరిజోడు ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ వెంకట్. 108 అంబులెన్స్ నెట్ వర్క్ ను ఆంధ్రాలో పరిచయం చేయడం వెనక మేథస్సు ఆయనది. చంద్రబాబుకు ఆయన తోడు రావడంతో, చకచకా ప్రణాళికలు రచించారు. వైద్య శిబిరాలు, ప్రత్యేక విమానాలు.. ఇలా ఆ దిశగా బాబు దూసుకుపోయారు.బాబు హుషారు, దానికి వచ్చిన ప్రతి స్పందన చూసి, మిగిలిన నాయకులు కూడా పాదం కలిపారు. దీంతో మొత్తం సీను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తిరిపోయింది.
ఇది సహించలేని బొత్సబాబు, దానం నాగేందర్, శవరాజకీయాలు చేస్తున్నారంటూ, బాబుపై మండిపడ్డారు. కానీ ప్రతిగా జనం మండిపడ్డారు. చేసేవారిని కూడా చేయనివ్వారా? అని. దాంతో కిరణ్ హూటా హుటిన ఢిల్లీ వెళ్లక తప్పలేదు. కానీ, పాపం , కిరణ్ అడుగు, చంద్రబాబు వెనకనే తప్ప, ముందు కాలేకపోయింది. వ్యూహరచనలో ఒక్క క్షణం ఆలస్యంగా ఆలోచించినా ఫలితం ఇలాగే ఉంటుంది. కిరణ్ కొంచెం ఆలస్యంగా ఆలోచించడం సరే. మరి అనుభవం పండిన బొత్స దానంల ప్రకటనలేమిటి? జనం మండిపడ్డారంటే, పడరా? పైగా దీనివల్ల మరో మైనస్ కూడా తప్పలేదు. కేంద్ర కాంగ్రెస్ ట్రక్కుల కొద్దీ సహాయ సామగ్రిని ఉత్తరాఖండ్ కు పంపింది. అదంతా ఇప్పుడు బాబు హవా ముందు కొట్టుకుపోయింది. ఆ సంగతి కూడా పాపం, కాంగ్రెస్ వారికి తెలియదేమో, కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు వారి మాటల్లో. ఇప్పుడు బాబు మరో అడుగు ముందుకు వేసి, వాడవాడలా సంతాప ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందో?