April 7, 2013

ఎన్టీఆర్ బొమ్మను ఇతర పార్టీలు వాడుకోవడం చెల్లదన్న బాలయ్య

జూనియరే ఖండించాలి
ఖండించకపోతే పరిణామాలు తప్పవు
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను
వైసీపీ వాడుకోవడంపై బాలకృష్ణ
టీడీపీలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం

గుడివాడ: పెద్ద ఎన్టీఆర్.. చిన్న ఎన్టీఆర్ బొమ్మలతో వైసీపీ నేత లు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల విజయవాడ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో పాల్గొనవద్దంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చిన ఆయన బాబాయ్, నటుడు బాలకృష్ణ.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కే నేరుగా అల్టిమేటం జారీచేశారు. తన బొమ్మలతో వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటును ఆయన ఖండించాలని, లేకపోతే పరిణామాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. అలాగే, జూనియర్ అనుచరుడైన కొడాలి నాని పార్టీని వీడడాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఈ విషయంలో గుడివాడ టీడీపీ కేడరంతా సంతోషంగా ఉందన్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని స్పష్టం చేసిన బాలకృష్ణ.. పార్టీకి ఆయనే తిరుగులేని నాయకుడన్నారు. సరైన సమయంలో తాను క్రియాశీల పాత్ర పోషిస్తానంటూనే.. ఆ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు తర్వాత తానే నేతనని చెప్పకనే చెప్పారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మనసు విప్పి మాట్లాడినా.. కొన్ని టిపై బాబు సూచనల మేరకే ఆయన స్పందించారని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఏ విభేదాలు లేవని బాలకృష్ణ ప్రకటించినా.. ఈ పరిణామంతో అబ్బాయ్.. బాబాయ్ మధ్య దూరం మరింత పెరిగిందని భావిస్తున్నారు.

"తన బొమ్మతో వైసీపీ ఫ్లెక్సీలు వేసుకోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలి. ఈ మేరకు సూచిస్తా. ఏ స్థాయి నాయకులైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందే. ఆయన ఖండించకపోతే పరిణామాలు తప్పవు'' అని బాలకృష్ణ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొమరవోలులో శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో జూనియర్ చురుగ్గా ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించగా, షూటింగుల్లో బిజీగా ఉన్నారని జవాబిచ్చారు. టీడీపీలో లోకేశ్‌ను క్రియాశీలం చేసేందుకే జూనియర్‌ను పక్కన పెడుతున్నారనే వాదన ఉందని విలేకరులు ప్రస్తావించగా- "ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడి తే గుర్తింపు ఉంటుంది.

వయసుతో పనిలేకుండా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆదరణ లభిస్తోంది'' అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మపై పూర్తి హక్కులు తెలుగుదేశానికే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బొమ్మను ఇతర రాజకీయ పక్షాలు ఉపయోగించడం చెల్లదని, అన్నగారి బొమ్మను ఉపయోగించుకుంటున్న ఆ పార్టీలపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. "ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆయన బొమ్మను పెట్టుకునే హక్కు టీడీపీకే ఉంది'' అన్నారు.

రాజశేఖరరెడ్డితోపాటు ఎన్టీఆర్ బొమ్మను కూడా వైసీపీ నాయకులు తమ ఫ్లెక్సీల్లో పెట్టుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా.. వైఎస్ఆర్ బొమ్మకు ఓట్లు రాలవని, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే ఓట్లు వేస్తారని భావించి ఆ పార్టీ నేతలు ఎన్టీఆర్ బొమ్మను వాడుకుంటున్నారని చలోక్తి విసిరారు. దేవుడి బొమ్మను ఎవరైనా పెట్టుకోవచ్చని, ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకునే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని చెప్పారు. అవిశ్వాసానికి టీడీపీ ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నించగా.. "అవిశ్వాసం ఎందుకు? లావాదేవీలకా, ఒప్పందాలు కుదుర్చుకోవడానికా?'' అని ప్రశ్నించారు.

కొడాలి నాని పార్టీని వీడి వెళ్లడంపై అంతా సంతోషిస్తున్నారని, ఎవరూ బాధపడటం లేదని చెప్పారు. కృష్ణా జిల్లా నుంచే మీరు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి తనను పోటీ చేయమంటున్నారని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పోటీ చేస్తానని జవాబిచ్చారు. గుడివాడ నుంచి పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు బాలకృష్ణ పక్కనే ఉన్న రావి వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తే సంతోషంగా ఆహ్వానిస్తామన్నారు.

జయప్రద టీడీపీలో చేరనున్నారా? అని ప్రశ్నించగా, ఆమె తనను కలిస్తే పార్టీతో మాట్లాడతానన్నారు. అయితే, జయప్రద రోజుకో పార్టీ పేరు చెబుతోందని చమత్కరించారు. చంద్రబాబు, బాలకృష్ణ రెండు అధికార కేంద్రాలన్న అభిప్రాయం ఉందన్న ప్రశ్నకు.. "మా నాయకుడు చంద్రబాబు. పార్టీ అధినేత చంద్రబాబు. ఇందులో మరో అభిప్రాయం లేదు'' అని తేల్చి చెప్పారు.