April 7, 2013

ఎట్టకేలకు చేతులు కలిపిన చిత్తూరు 'దేశం' నేతలు


చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మందలింపులు చిత్తూ రు తెలుగు తమ్ముళ్ళపై తక్షణ ప్రభా వం చూపాయి. అధినేత ఆదేశంతో రంగంలోకి దిగిన ఎంపీ శివప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు చేసిన మ«ధ్యవర్తిత్వంతో వర్గ విభేదాలన్నీ అటకెక్కా యి. దారులు మార్చిన నేతలు పరస్పరం చేతులు కలిపారు. కలసికట్టు గా సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొని తమ మధ్య తలెత్తిన వివాదం టీ కప్పులో తుఫానంటూ తేల్చేశారు. అయితే ఇరువర్గాల మధ్య పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం నిరంతరంగా పనిచేసే సమన్వయకర్తను నియమించడం చూస్తే మాత్రం చిత్తూరు టీడీపీలో తలెత్తిన వర్గ విభేదాలు అంత త్వరగానూ, అంత సులువుగానూ సమసిపోయేవి కాదని ఇట్టే అర్థమవుతోంది.

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రకటనతో చిత్తూరు నియోజకవర్గ నేతల్లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులుకూ, నియోజకవర్గంలోని పలువురు ముఖ్యనేతలకూ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చా యి. జంగాలపల్లె శ్రీనివాసులు దాదాపు ఒంటరి కాగా, మిగిలిన ముఖ్య నేతలు దొరబాబు, మాజీ ఎంపీ దుర్గ, నానీ, బాలాజీ నాయుడు, కఠారి మోహన్, మోహన్ రాజు, కాజూరు బాలాజీ, నీరజాక్షులు నాయుడు తదితరులంతా మరోవైపు మొహరించారు. పరస్పరం అపనమ్మకంగా వుండడంతో ఎవరికి వారు దూరంగా వుంటూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించుకునే దాకా పరిస్థితి దారి తీసింది. దీని పర్యవసానంగా అధినేత ఆదేశించిన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పట్టణంలో ఇరు వర్గాలూ వేర్వేరుగా నిర్వహించాయి. సొంత జిల్లాలో అందునా జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా వుంటే మిగిలిన మిగిలిన చోట్ల పార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళతాయంటూ అ««ధినేత ఆగ్రహించారు. శుక్రవారం చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులుకు ఫోన్లు చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారిరువురూ రంగంలోకి దిగి సాయంత్రానికల్లా చిత్తూరు చేరుకున్నారు. నగరం వెలుపలున్న ఓ ప్రముఖ హోటల్‌లో ఇరు వర్గాలనూ సమావేశపరిచారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ పంచాయితీ జరిపారు. ఈ సందరంగా ఎవరికి వారు తమ అభ్యంతరాలను వినిపించినట్టు సమాచారం. అదే సమయంలో చంద్రబాబు జంగాలపల్లెకు ఫోన్ చేసి సీనియర్లను, అందరినీ కలుపుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించినట్టు తెలిసింది. దీంతో మొత్తానికీ ఇరు వర్గాల మధ్య సయో«ధ్య కుదిరింది. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు దయారామ్‌ను ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా నియమించారు. పార్టీ కార్యక్రమాల గురించి ఏ వర్గమైనా మరో వర్గానికి సమాచారమివ్వాలంటే ముందుగా దయారామ్‌కు చెపితే ఆయన ఎదుటి వర్గానికి సమాచారమందించి సమన్వయం కుదుర్చుతారు. శనివారం సాయంత్రం అంతా కలసికట్టుగా నాయుడు బిల్డింగ్స్ ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.