April 7, 2013

కాళ్లు మొరాయిస్తున్నా పట్టుదలతో పాదయాత్ర

కాకినాడ 187 రోజులు, 2,632 కిలోమీటర్ల నడక. అదీ అరవై మూడేళ్ల వయసులో.. కాళ్లు నొప్పిపుడుతున్నా కార్యకర్తలు ఇస్తున్న ఉత్సాహం, తండోపతండాలుగా రోడ్లపైకి వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు రోజురోజుకు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర సాగిస్తున్నారు.

నెల్లిపూడి, బెండపూడి, అన్నవరంలలో శుక్రవారం బాబు పాదయాత్ర సాగింది. నెల్లిపూడి, బెండపూడి మార్గ మధ్యలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో చంద్రబాబు కొంతసేపు ఆగి కాళ్లకు ఫిజియోథెరపీ చేయించుకున్నారు.

మార్చి 20న మన జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర శనివారం నాటికి 18 రోజులు పూర్తయింది. జిల్లాలో ఇప్పటివరకు 206 కిలోమీటర్ల మేర చంద్రబాబు నడిచారు. 200 కిలోమీటర్ల మైలురాయిని దాటి మరో రికార్డు నెలకొల్పనున్నారు.

రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కార్యకర్తల సమీక్ష సమావే శం, మరో గంటసేపు వివిధ వర్గాలు, చేతివృత్తుల వారితో చర్చలు, సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పాదయాత్ర, మార్గ మధ్యలో గ్రామాల్లో బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రోజూ 10 నుంచి 13 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగిస్తున్నారు. మార్గమధ్యలో తనను కలిసినవారితో సమస్యలు సావధానంగా వింటూ టీడీపీ అధికారంలో వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తానంటూ హమీలు ఇస్తున్నారు.

పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశాల్లోను కష్టం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు నాయకులకు ఉచిత సలహాలు ఇచ్చి వారు మాత్రం పనిచేయడంలేదని అడపాదడపా చురకలు కూడా వేస్తున్నారు.