April 7, 2013

ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది చంద్రబాబే

టీడీపీలో 83 నాటి ఊపు
కృష్ణా జిల్లా పర్యటనలో సినీనటుడు బాలకృష్ణ

విజయవాడ : తన తండ్రి ఆశయ సాధన కోసం.. ప్రజలు, రైతులు, అభిమానుల కోసం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, అందరూ తనను ఆశీర్వదించాలని సినీనటుడు బాలకృష్ణ కోరారు. ఎన్టీఆర్ తరువాత రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబేనని ఆయన కొనియాడారు. 1983 నాటి తెలుగుదేశం పార్టీ వైభవం మళ్లీ ఇప్పుడు సాక్షాత్కరిస్తుందని బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.

టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాలోని కలగర, రేపూడి తండా, కుమ్మరికుంట్ల, హనుమల్లంక, గంపలగూడెం మండలం పరిధిలోని కొత్తపల్లి, పెదకొమర, సత్యాలపాడు, పెనుగొలను తదితర ప్రాంతాల్లో బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు.

కలగర గ్రామంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కష్టాల్లో ఉన్నప్పుడు, తెలుగుజాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టుకు గురైనప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని కీలుబొమ్మలా ఆడించిన తరుణంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేశారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులెవరూ పాలన వ్యవహారా ల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అలా చేసిన వారు ఇప్పుడు జైలులో ఉన్నారని బాలయ్య వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలనపై నిప్పులు
టీడీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే, కాంగ్రెస్ హయాంలో అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరగటానికి, సర్ చార్జీల భారం మోపటానికి నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవలంబించిన విధానాలే కారణమన్నారు. ఆ తరువాత కుమ్మరికుంట్ల గ్రామంలో మాట్లాడుతూ... టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. చీమలపాడు, హనుమల్లంక గ్రామాల్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తానని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశారు.