April 7, 2013

చివరి అడుగు విశాఖలో 27తో బాబు పాదయాత్ర పూర్తి

ముగింపు రోజున భారీ సభ

ఒకే ఒక్కడు! 63 ఏళ్ల యువకుడు! 208 రోజులు! కాస్త అటూ ఇటుగా 3000 కిలోమీటర్లు! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ పాదయాత్ర 'వస్తున్నా.. మీకోసం'కు ముగింపు ఇవ్వనున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభించిన తన పాదయాత్రను ఆయన ఈనెల 27వ తేదీన విశాఖపట్నంలో ముగించనున్నారు.

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 27వ తేదీన విశాఖ జిల్లాలో ముగుస్తుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అప్పటికి బాబు 208 రోజుల్లో 2,900 కిలోమీటర్లు నడిచినట్టు అవుతుందని వివరించారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో యనమల విలేకరులతో మాట్లాడారు. యాత్ర ముగింపు రోజున విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలిపారు.

నగర శివార్లలో ఏర్పాటు చేయనున్న పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారని చెప్పారు. బహిరంగ సభ కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, మునిసిపల్ స్టేడియాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని.. ఈ ఏర్పాట్లు, నిర్వహణ పర్యవేక్షణకు రాష్ట్ర కమిటీ ఇద్దరు పరిశీలకులను నియమిస్తుందని వివరించారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మార్పు కోరుతున్న రాష్ట్ర ప్రజలు.. చంద్రబాబు యాత్రకు నీరాజనం పడుతున్నారన్నారు. ప్రజా స్పందనే ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగేలా తోడ్పడుతున్నదని తెలిపారు. చంచల్‌గూడ జైలు వైసీపీ కార్యాలయంగా మారిందని, ఆ జైలుపై జగన్ పార్టీ జండాను ఎగురవేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. కాగా, పాదయాత్రకు ఆదివారం చంద్రబాబు విరామం ప్రకటించారు. సోమవారం యథావిధిగా ఆయన నడక కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.