April 6, 2013

పల్లెలన్నింటా అప్పుల తిప్పలే!


అప్పులేని వాడు అదృష్టవంతుడు! పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వకూడదని తల్లిదండ్రులు తాపత్రాయపడతారు. అప్పు లేకపోతే ఏ కప్పు కింద పడుకున్నా తెల్లారిపోతుందని కూలివాడు ఆశపడతాడు. అప్పుల వాళ్లు ఇంటి ముందుకు వచ్చేపరిస్థితి కల్పించకు దేవుడా..! అని సామాన్యుడు వేడుకుంటాడు. కానీ, మన రాష్ట్రంలో అప్పు లేనిదెవరికి? మన తల్లిదండ్రులకున్న మనసు ఈ పాలకులకు ఉంటుందా! "మా రుణం మాఫీ చేయకపోతే పోనీ.. కొత్త పన్నులు మోదకుండా ఉంటే అదే పది వేలు'' అంటూ ఎ.కొత్తపల్లిలో ఎస్సీ కాలనీలోని ఆ మహిళ అసలు విషయం కుండబద్దలు కొట్టింది.

అంత ధైర్యంగా మాట్లాడుతున్న ఆమె ఎవరా అని చూశాను. "సార్! నాకు 20 వేలు దాకా అప్పులున్నాయి. వడ్డీకింద నెలకు వెయ్యి రూపాయలు కడుతున్నాను. కట్టే స్థోమత లేదు.. అలాగని అప్పుల వాళ్లు ఇంటిమీద పడితే పరువు పోతుందని భయం. ఈ వడ్డీలు కట్టేసరికే తాడు తెగుతోంది. అసలు తీరేప్పటికి ఆయువే ఊడేలా ఉంది'' అని ఆమె చెప్పుకుపోయింది. కడుపు కట్టుకొని అప్పులు కడుతున్నామని అక్కడున్న మరికొందరు కూడా వాపోయారు. అప్పులూ తీరవు.. మాకీ అవస్థలూ పోవు అంటూ నిష్ఠూరమాడుతుంటే దిగులేసింది.

రైతులను కదిలించినా పేదలను పలకరించినా చిరువ్యాపారితో మాట కలిపినా ఒకటే గోడు. లక్షలాధికారులను చేస్తామంటూ చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని ఆడపడుచుల ఆవేదన. పేదల సొమ్ము కాంగ్రెస్ నేతల బొక్కసం నింపుతుంటే.. అవినీతి కారణంగా పేదవాడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది. యాత్ర ప్రారంభం అవుతూనే విద్యార్థులు వచ్చి కలిశారు. 'మా భవిష్యత్తుకు మీరు భరోసా ఇవ్వా''లని వాళ్లు అడుగుతుంటే, 'పెద్దన్న'లా ధైర్యం చెప్పాను. వాళ్ల కుటుంబాలకు 'పెద్దకొడుకు'లా భరోసా ఇచ్చాను. " మీ కోసమే వచ్చాను. మీ కష్టాల్లో చివరి దాకా ఉంటాను. మీ కన్నీళ్లు తుడిచిగానీ నడక ఆపను''అని భుజం తట్టి ముందుకు కదిలాను.