April 6, 2013

అదే బీడు.. అదే గోడు

పేదవాడి పొట్ట నింపలేని మాటలు ఎందుకు? కష్టంలో ఉన్నవారికి చెయ్యి అందించలేని చేతలు ఎందుకు? రాష్ట్రం చీకట్లో ఉన్నప్పుడూ రణం చేయలేని రాజకీయ పార్టీ ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానంగానే తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. నాడు రాష్ట్రం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు గానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని అంధకారంలో నింపినప్పుడు గానీ మేము చేసిన, చేస్తోన్న పోరాటం సిద్ధాంతంలో భాగమే. ఎన్టీఆర్ అయి నా, ఆ తరువాత నేనయినా..రాష్ట్రంలోని చివరి పౌరుడిని కూడా చేరే విధంగా ప్రభుత్వ విధా నాలు అమలుచేశాం.

రాజకీయం కోసం కాదు.. రవ్వంత భరోసాను పేదసాదలకు ఇచ్చేందుకు మేం కష్టించాం. కానీ, ఇప్పుడేంటి? కమీషన్లు తప్ప మరో సిద్ధాంతం కనిపించడం లేదు. 'నాకేంటి?' అన్న తత్వమే ఈ ప్రభుత్వ విధానంగా మారిపోయింది. నెల్లిపూడిలోని 'పోలవరం' కాలువలను చూసినప్పుడు.. ఇదే అనిపించింది. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన తీరుకు ఈ కాలువలే నిదర్శనం. అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార నేతల దాహార్తికి వట్టిపోయిన ఆ కాలువలను చూసినప్పుడు కడుపు తరుక్కుపోయింది.

ఈ పాలకులు గొప్పగా చెప్పుకొంటున్న ఇలాంటి కాలువలు మన రాష్ట్రంలో ఎన్ని లేవూ? అసలు రేపయినా ఈ కాలువల్లో నీళ్లు పారతాయా? దారిలో పామాయిల్, జీడిమామిడి రైతులు కలిశారు. వాళ్ల వాలకం చూస్తే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వెలుగు నిండిన కళ్లతో నా చుట్టూ మూగారు. నేను పలకరించే లోపలే.. నా యోగక్షేమాలు కనుక్కున్నారు. 'ఎంత కష్టపడుతున్నారు సార్!' అంటూ కళ్లు వత్తుకున్నారు. అక్కడ అనంతపురం నుంచి ఇక్కడి అన్నవరం రైతు దాకా.. ప్రాంతం మారుతుందే గానీ, పంట కష్టం మారదు. అదే బీడు.. అదే గోడు..!