April 6, 2013

వైఎస్ హయాంలో లక్షల ఎకరాలు ధారాదత్తం

సెజ్‌లు రద్దు చేస్తా!
పేదలను ముంచి 'రియల్'కు ప్రగతి
కాకినాడలోనే 15 వేల ఎకరాలు
అధికారంలోకి రాగానే ఆ భూమంతా పేదల వరం
50 యూనిట్ల 'ఉచితం' ఏ మూలకు?
ఎస్సీలను మోసగిస్తున్న కిరణ్
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం


రాజమండ్రి, తుని : రామరాజ్యం తెస్తా.. సెజ్‌లను రద్దు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. "మీ కష్టాలూ కన్నీళ్లూ తుడవడానికి వేల కిలోమీటర్లు నడిచివచ్చాను. ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. ఐదేళ్లూ మీ పెద్ద కొడుకుగా సేవచేస్తా''నని ప్రజలను కోరారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా నడిచారు.

దారిలో రైతులు, ఇటుకబట్టీల కూలీలు, మహిళలు, ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సెజ్‌ల పేరిట కాకినాడకు వైఎస్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. "దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్ రాష్ట్రవ్యాప్తంగా 113 సెజ్‌ల కోసం 2 లక్షల ఎకరాలు ఇవ్వగా, కాకినాడలోనే 15 వేల ఎకరాలను కేటాయించారు. ఇక్కడ ఏవిధమైన ప్రగతీ లేదు గానీ, పేదల భూములను లక్షల రూపాయలకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే సెజ్‌లను రద్దు చేస్తాం. పేదల భూములను తిరిగి వారికే ఇచ్చేస్తాం'' అని హామీ ఇచ్చారు. ఎస్సీలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్న సీఎం ప్రకటన మోసపూరితమని విమర్శించారు.

ఎవరైనా 100 యూనిట్ల పైగానే వాడతారని, అలాంటప్పుడు సీఎం చెప్పే ఊరట ఎవరి కోసమని ప్రశ్నించారు. బ్రాహ్మణవర్గాల్లో పేదలు పెరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. వారి కోసం తిరుపతిలో కాలనీలు నిర్మించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, రూ. 500 కోట్లతో సంక్షేమ నిధి పెడతామని, వారి పిల్లలను చదివిస్తానని హామీ ఇచ్చారు. సామాజికన్యాయం కోసం వర్గీకరణకు మొగ్గినా.. మాలలకు అన్యాయం జరగనివ్వనని చెప్పుకొచ్చారు. అనంతరం ఎ. కొత్తపల్లి కాలనీలో ఎస్సీ విద్యార్థులను కలుసుకున్నారు. 62 ఏళ్ల వయసులో ఇంతశక్తి మీకెలా వచ్చిందని ఒక విద్యార్థి ప్రశ్నించగా, ప్రతి మనిషికీ శక్తి ఉంటుందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన చెప్పారు.