April 6, 2013

నెలకు రూ.75 ఊరటా?.. చీప్ లిక్కర్ ఖర్చంత లేదు

తగ్గింపు కంటితుడుపు!
పెంచిన చార్జీలు రద్దు చేయాల్సిందే!
ఉప ప్రణాళికపై చర్చకు సిద్ధమా?: చంద్రబాబు సవాల్

కాకినాడ, తుని: విద్యుత్ చార్జీలను రూ.6,500 కోట్ల మేర పెంచారు. కంటితుడుపుగా రూ.830 కోట్లు తగ్గించి సీఎం కిరణ్ కపట నాటకాలాడుతున్నారు. ఓడిపోతామన్న భయంతో నెలకు రూ.75 చొప్పున బిల్లు తగ్గించారు. ఆ తగ్గించిన కరెంటు బిల్లు, మందుబాబులు ఒక రోజు తాగే చీప్ లిక్కర్ ఖర్చంత లేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెంచిన చార్జీలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై నాటకాలాడుతున్న ప్రభుత్వం, వైసీపీలు..చర్చకు సిద్ధమా అని ఘాటుగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడి వద్ద చంద్రబాబు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు.

బెండపూడి, అన్నవరం, గోపాలపట్నం మీదుగా నడక సాగించారు. నెల్లిపూడిలో గీత కార్మికులు, కౌలు రైతులు, చిరువ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బెల్టు షాపులు, అక్రమ సారా వల్ల తమ ఉపాధి దెబ్బతింటున్నదని ఓ గీత కార్మికుడు అనగా.."తమ్ముడూ! మన గవర్నమెం టు వచ్చాకా.. బెల్టుషాపులు రద్దు చేసి గీత కార్మికులను ఆదుకుంటా''మని భరోసా ఇచ్చారు. తనను కలిసిన కౌలు రైతులకు ధైర్యం చెప్పారు. వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

"మా హయాంలో వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేవి. ఇపుడు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతోంది'' అని ఎద్దేవా చేశారు. గొర్రెల కాపరుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. చెంచల్‌గూడ జైలునే పార్టీ కార్యాలయంగా పెట్టుకుంటే బాగుంటుందని నెల్లిపూడి సభలో వైసీపీకి సలహా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే..జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని బెండపూడి సభలో ధ్వజమెత్తారు. "ఉప ప్రణాళిక తెచ్చామని గొప్పగా ప్రకటించుకొని.. ఆ మరునాడే ఆ నిధులను బ్యాలెట్ బాక్సుల గోదాములకు తరలించారు. నాడేమో ఆ నిధులతో వైఎస్ ఇడుపులపాయకు రోడ్డేయించుకున్నారు.. కాదేమో ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను చెప్పమనండి? ఈ విషయంలో వారితో చర్చకు నేను సిద్ధమే'' అని సవాల్ విసిరారు.

పాదయాత్రకు ముందుగా..నెల్లిపూడిలో రంపచోడవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. "పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లోనూ మనమే గెలవాలి తమ్ముళ్లూ!''అంటూ వారిని ఉత్సాహపరిచారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఈసారి తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటినుంచే జనంలోకి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై; వైఎస్, కాంగ్రెస్‌ల అక్రమాలపై ఎక్కడికక్కడ వివరించాలని పిలుపునిచ్చారు."ఇన్నాళ్లూ జెండా మోశాం. ఇక అధికారంలోకి రావాలి. వచ్చే పంచాయతీ, నీటి సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంటు.. అన్నింటిలోనూ గెలవాలి'' అని పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేశారు.

టీడీపీలోకి 'పీఆర్పీ' పెదబాబు
నరసాపురం ఎంపీ స్థానం నుంచి పీఆర్పీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చింతం పెదబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. కత్తిపూడిలోని పాదయాత్ర స్థలి వద్దకు భారీ వాహన కాన్వాయ్‌తో సుమారు 400 మందికి పైగా అనుచరులతో పెదబాబు వచ్చారు. పార్టీ కండువా వేసి ఆయనను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.