April 3, 2013

సొంత ప్రయోజనాలకోసమే పీలేరు అభివృద్ధి : ముద్దుకృష్ణమ నాయుడు


పుత్తూరు: జిల్లాను, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కేవలం సొంత ప్రయోజనాల కోసమే కలికిరి, పీలేరును ముఖ్యమంత్రి అభివృద్ధి చేసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. పుత్తూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరి మండలంలో సైనిక్ పాఠశాల, పోలీసు బెటాలియన్, వంద పడకల ఆస్పత్రి తదితర వాటిని ఏర్పాటు చేయడం సీఎం తన తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఆస్తులను పెంపు చేసేందుకేనని ఆరోపించారు.

అయితే సొంత నియోజకవర్గానికే నిధులన్నీ కేటాయించడం చూస్తే, కిరణ్ పీలేరుకు సీఎంలా పనిచేస్తున్నారే తప్ప రాష్ట్రానికి కాదని ఎద్దేవా చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సొంత పనులు చూసుకు వెళ్లారే తప్ప, విద్యుత్ కోతలతో నష్టపోతున్న జిల్లా రైతులు, పవర్‌లూమ్స్ కార్మికుల గోడు పట్టించుకోలేదని విమర్శించారు. రెగ్యులేటరీ కమిషన్ వద్దంటున్నా ప్రజలను దోపిడీ చేసేందుకే ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచారని పేర్కొన్నారు. సీఎం తన బూటక హామీలు పక్కనుంచి జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి మండలం, మున్సిపాలిటీలకు రూ.కోటి వంతున నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ జిల్లా, మండల నాయకులు హరి, సి.ఎస్.బాబు, రాజశేఖర్‌వర్మ, భాస్కర్, రాజశేఖర్‌వర్మ, షణ్ముగరెడ్డి పాల్గొన్నారు.