April 3, 2013

ఆరేళ్ల తరువాత ఆ ఉద్యమ క్షేత్రంలోకి..

గోడలు బీటలు వారాయి. ఇంట్లో సామానంతా చెల్లాచెదరైంది. కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. అంతకన్నా ముందే పశువుల కొట్టంలో కట్టేసిన జీవాలు కట్టు తెంచుకొని ప్రాణభీతితో ఎటుపడితే అటు పోయాయి.. భూకంపం వచ్చినప్పుడు కనిపించే ఈ దృశ్యం.. ఈ రోజు పాదయాత్రలో నన్ను కలవరపెట్టింది. భూమి పోయాక ఏమున్నా లేనట్టే! భూమి తలకిందులైతే ఏదీ మిగలదు. కాకినాడ సెజ్ నిర్వాసితులను కలిసి మాట్లాడినప్పుడు ఇదే భావం కలిగింది.

'సెజ్' ప్రభావిత గ్రామాలన్నీ భయం గుప్పిట్లో ఉన్నాయట! ఎప్పుడు రెవెన్యూ అధికారులు, పోలీసులు తమ పల్లెలపై దాడులు చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని.. నిన్నటిదాకా రైతుతనంతో తలెత్తుకు తిరిగిన వారు వాపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు..దాదాపు ఆరేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. నిజమే.. వీళ్ల ఆందోళనతో నాకూ పరిచయం ఉంది. కాకినాడ సెజ్ రూపంలో తమ పంటపొలాలకు ప్రమాదం దాపురించిందని ఏడాది క్రితం వీళ్లంతా నన్ను కలిశారు.

వారి విజ్ఞప్తి మేరకు 'సెజ్' ఆందోళనలో అప్పట్లో నేనూ పాల్గొన్నాను. కొల్లపల్లి, తొండంగిలో జరిగిన ఆ సంగతులు మరోసారి గుర్తుకొచ్చాయి. వీళ్లు చెబుతుంటే మరింత బాగా ఆ విషయాలు కళ్లముందు నిలుస్తున్నాయి. "సార్! అప్పట్లో మా కోసం వచ్చారు. 'సెజ్'కింద పోయే పొలాల్లో కాలినడకన తిరిగారు. అరక పట్టి మాకు ధైర్యం చెప్పారు'' అని చెబుతుంటే.. ఇప్పటికీ గట్టిగా నిలబడి కలబడుతున్న వాళ్ల పట్టుదలను అభినందించకుండా ఉండలేకపోయాను.

పిఠాపురంలో యువకుల కదలిక ఉత్సాహాన్నిచ్చింది. వీళ్లమీదే నా ఆశా, శ్వాసా..! వారంతా అవినీతిపై పదునైన మాటలతో దండెత్తడం బాగా అనిపించింది. నా పోరాటం ఒక కుటుంబంపైనో, ఒక వ్యక్తిపైనో కాదు.. అవినీతి భూతాన్ని రాష్ట్రం పొలిమేరల అవతలకు పారదోలడమే నా జీవితాశయం. పదవిలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష నేతగానూ నేను పోరాడుతున్నది అభివృద్ధి కోసమే.. అవినీతిని చంపకుండా అది సాధ్యం కాదు. కాబట్టే.. ప్రజలకు తెలిసిన మనుషులు, వాళ్ల చీకటి పనులను చెబుతూ ముందుకు కదులుతున్నాను. ఈ తరం యువతకు అది అర్ధమైతే నా కష్టం ఫలించినట్టే!