April 3, 2013

కాపులకు 5 వేల కోట్లు

కోటాపైనా త్వరలో మంచి నిర్ణయం
చిరంజీవి వల్ల కొంత దూరమైనా.. మళ్లీ చేరువ
.తూర్పు'పాదయాత్రలో చంద్రబాబు హామీ



కాకినాడ : టీడీపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని కాపుల సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రిజర్వేషన్ కల్పనపైనా సర్వే జరుగుతున్నదని, త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చర్చిసెంటర్, ఉప్పాడ సెంటర్‌ల మీదుగా గొల్లప్రోలు వరకు ఆయన నడిచారు. పిఠాపురం చర్చి సెంటర్‌లో ఓ భవన నిర్మాణ కార్మికుడు తన కష్టాలు చెప్పుకోగా..సానుభూతితో విన్నారు.

అనంతరం సెలూన్ షాపు, చర్మకారులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి క్షేమ సమాచారం విచారించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన పలు వివిధ సభల్లో ఆయన కాపులపై వరాలు కురిపించారు. "అగ్రవర్ణాల్లో కాపుల్లోనే పేదలు ఎక్కువ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఈ సామాజిక వర్గానికి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు వెచ్చిస్తాం. కాపులకు రిజర్వేషన్ అంశంపైనా సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం'' అని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

"ముందు నుంచీ కాపులు మా పార్టీకి అండగాఉన్నారు. చిరంజీవి మాయమాటలు నమ్మి వారు కొంత దూరం కావడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం'' అని వివరించారు. కాపు సోదరులంతా తిరిగి టీడీపీకి రావాలని ఆహ్వానించారు. కాపుల పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. అంతకుముందు.. పిఠాపురంలో మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే కార్యకర్తలకు అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని చెప్పారు.

"సార్! మన పార్టీ అధికారంలో ఉండగా గ్రామాల్లో నోడల్ వ్యవస్థని ప్రోత్సహించి.. అభివృద్ధి పనుల్లో కార్యకర్తల ప్రమేయం లేకుండా చేశాం. దానివల్ల మాకు గుర్తింపు తగ్గింద''ని ఒక కార్యకర్త అనగా, "ఆ తప్పులు మళ్లీ జరగవ్. కార్యకర్తలకు అన్నింట్లోనూ ప్రాధాన్యం ఉంటుంది.'' అని పేర్కొన్నారు. వైఎస్ తనపై గ్లోబెల్ ప్రచారం చేసి కొంతవరకు నమ్మించగలిగారని, వ్యవసాయం దండగని తాను అనకపోయినా అన్నట్టు దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు.

అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు ద్రోణంరాజు సత్యనారాయణతో ఎన్టీఆర్‌పై 101 ఆరోపణలతో కేసు వేయించినా, వైఎస్ హయాంలో తనపై 25 విచారణ కమిటీలు వేసినా ఏ తప్పు చేయలేదు కాబట్టే తమకు కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని చెప్పారు. కొడుకు ఆడుకోవడానికి టీవీ చానల్, రాసుకోవడానికి పేపరును వైఎస్ ఇచ్చారని చెప్పారు. కానీ, తమ పార్టీకి కార్యకర్తలే పేపర్లు, టీవీలుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలంతా టీడీపీ వైపు ఉన్నారని, వారికి సరిగా చెప్తే విజయం తథ్యమని అన్నారు. ఆ తరువాత ఆయన పిఠాపురంలో జరిగిన తెలుగు యువత సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడితే..చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 32 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు.