April 19, 2013

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

అనకాపల్లి
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను 500 మంది వికలాంగుల మధ్య నిర్వహించనున్నట్టు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలను ఈనెల 20న కశింకోట మండలం కన్నూరుపాలెంలో నిర్వహించనున్నామన్నారు. చంద్రబాబు 64వ జన్మదినం కావడంతో 64 కేజీల కేక్ ఒకటి, 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా 200 కేజీల కేక్ మరొకటి చంద్రబాబు కట్ చేస్తారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు వస్తున్నందున వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా చిడతలు, తప్పెటగుళ్లు, నేల వేషాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 20వతేదీ సాయంత్రం పాదయాత్ర ముందు భారీగా బాణసంచా కాల్చడానికి నిర్ణయించామన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం, ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలను వేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మళ్ల సురేంద్ర, మళ్ల రాజా, డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, గుత్తా ప్రభాకర చౌదరి, కర్రి దివాకర్, కర్రి శివుడు, తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర వివరాలు

అనకాపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర వివరాలను టీడీపీ రూరల్‌జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ వివరించారు. 19వతేదీ రాత్రికి కశింకోట మండలం కన్నూరుపాలెం చేరుకొని రాత్రికి బస చేస్తారన్నారు. 20వతేదీన కన్నూరుపాలెంలోనే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని, ఆ వేడుకల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాల్గొంటారన్నారు. సాయంత్రం నాలుగుగంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి కొత్తూరు, సుందరయ్యపేట, జి.భీమవరం, అచ్చెర్ల జంక్షన్, బంగారయ్యపేట మీదుగా తాళ్లపాలెం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు.

21వ తేదీన విశ్రాంతి తీసుకొని విశాఖనగరంలో వున్న నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. 22వతేదీన తాళ్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించి ఉగ్గినపాలెం, పరవాడపాలెం, బయ్యవరం మీదుగా కశింకోట చేరుకుంటారన్నారు. అక్కడ రాత్రి బస చేసి 23న కశింకోటలో పాదయాత్ర ప్రారంభించి పిసినికాడ, కొత్తూరు జంక్షన్, బైపాస్‌రోడ్డు జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూచౌక్ జంక్షన్‌కు చేరుకొని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారన్నారు.

అనంతరం చిననాలుగురోడ్ల జంక్షన్ మీదుగా రింగ్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. అక్కడి నుంచి గవరపాలెం, పరమేశ్వరిపార్కు, సుంకరమెట్టజంక్షన్ మీదుగా శంకరం, రేబాక చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు. 24వతేదీన రేబాక నుంచి ప్రారంభమై కాపుశెట్టివానిపాలెం, కోడూరు జంక్షన్ మీదుగా పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టి బాటజంగాలపాలెం, అసకపల్లి జంక్షన్ మీదుగా సబ్బవరం చేరుకుంటారని రత్నాకర్ తెలిపారు.