April 19, 2013

ఎన్టీఆర్@ 60.. చంద్రబాబు @64 పార్టీని నడిపిస్తూ.. అడుగు ముందుకు వేస్తూ

అనితరసాధ్యంగా పాదయాత్ర

హైదరాబాద్ : నాడు..
అరవై ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు చైతన్య రథంపై రాష్ట్రాన్ని చుట్టి అసామాన్యుడని అనిపించుకొన్నారు.

నేడు...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 64 ఏళ్ల వయసులో రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్రతో తిరిగి అనితరసాధ్యుడని అనిపించుకొంటున్నారు.

శుక్రవారానికి ఆయన తన ఇల్లు వదిలి సరిగ్గా 200 రోజులు. గత ఏడాది అక్టోబర్ 2న ఇల్లు వదిలిన ఆయన ఇంత వరకూ తన ఇంటి మొహం చూడలేదు. పాదయాత్రలు మన రాష్ట్రానికి కొత్త కాదు. కానీ, ఈ వయసులో ఇంత సుదీర్ఘ పాదయాత్రను రాష్ట్రం చూడలేదు. 13 ఏళ్ల కిందట పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ సుమారు 1400 కిమీ నడిచారు. పైగా అప్పుడు ఆయన వయసు ఇప్పుడు చంద్రబాబు కంటే పదేళ్లు తక్కువ. ఈ మొత్తం యాత్రలో ఆయన 16 జిల్లాలు సందర్శించారు.

82 నియోజకవర్గాలు, 1209 గ్రామాలు, 160 మండలాలు, 27 మునిసిపాలిటీలు, 4 కార్పొరేషన్ల మీదుగా ఆయన నడక సాగింది. 60 ఏళ్ల వయసులో ఎన్టీ రామారావు చైతన్య రథంపై సుడిగాలి పర్యటనలు చేసినప్పుడు ఆయనది ఉక్కు శరీరమన్న ప్రశంసలు వినిపించాయి. తాను అంతకంటే గట్టి వాడినని చంద్రబాబు ఇప్పుడు నిరూపించుకొన్నారు. 'ఆరున్నర నెలలుగా విరామం లేకుండా పాదయాత్ర చేయడం మాటలు కాదు. ఒక జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో పూర్తిగా కనీసం ఆ జిల్లా వరకూ అయినా పాదయాత్ర చేసిన నాయకులను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

కేవలం నడవడమే కాకుండా ప్రజలతో కలిసిపోవడం, వారితో చర్చించడం వంటి వాటితో ఆయన ప్రతిచోటా యాత్రను ఉత్సాహభరితంగా మలిచారు. అది గొప్ప విషయం'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షునిగా అన్ని విషయాలూ చూసుకొంటూనే పాదయాత్ర చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అయినా దానిని అధిగమించగలిగారు. పాదయాత్ర సమయంలో అనేక సంక్షోభాలను పార్టీ చవిచూసింది.

అటు కోస్తా.. ఇటు తెలంగాణలో కొంతమంది నేతలు పార్టీ ఫిరాయించారు. ఇంకా అనేక మంది గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతి రోజూ వదంతులు షికార్లు చేశాయి. వివిధ కారణాలపై పార్టీలో కొందరు సీనియర్లు అలకబూనారు. ఒకపక్క యాత్ర చేస్తూనే చంద్రబాబు వీటన్నింటినీ సమన్వయపర్చుకొంటూ వచ్చారు. ఇందుకు అనేక మంది పార్టీ నేతలు ఆయనకు తమ వంతు సహకారం అందించారు.

ఆయన యాత్ర ప్రజల్లో చర్చనీయాంశం అవుతోందని గుర్తించిన నేతలు క్రమంగా దాని స్థాయిని పెంచుకొంటూ వచ్చారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా నుంచి యాత్ర ఊపు పెరిగిందన్నది ఆ పార్టీలో ఉన్నమాట. ఆయన యాత్ర మధ్యలో జరిగిన సహకార ఎన్నికల్లో రెండు డీసీసీబీలు గెలుచుకోవడంతోపాటు నాలుగైదు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సొసైటీలను గెలుపొందడం ఆ పార్టీ శ్రేణులకు స్ధైర్యాన్ని పెంచింది.